
ప్యారిస్: స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ రఫెల్ నాదల్ సోమవారం చేసిన ఫేస్‌బుక్ అప్‌డేట్ అభిమానులను అయోమయానికి గురిచేసింది. 'నాకు పెళ్లైంది' అంటూ ఈ స్పెయిన్ బుల్ తన రిలేషన్షిప్ స్టేటస్‌ను పొరపాటున అప్‌డేట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. ఇది చూసి కొందరు ఫ్యాన్స్ ఆనందపడగా.. మరికొందరు నదాల్‌కు మళ్లీ పెళ్ళా అంటూ సందేహం వ్యక్తం చేశారు. గతంలోనే పెళ్లైంది కదా? ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో ఎలా పెళ్లి చేసుకున్నావ్?అని మరి కొందరు ప్రశ్నించారు. ఇంకొందరేమో 'మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు!' అని తెలియజేశారు.
'రఫాకు, అతడి భార్యకు అభినందనలు!! మీ ఇద్దరికీ ఎప్పుడో పెళ్లైందనే అనుకున్నా! చూస్తుంటే కాలేదని అనిపిస్తోంది' అని ఓ అభిమాని కామెంట్ చేశారు. 'ఈ బాంబుతో ఎంతమంది హృదయాలు ముక్కలయ్యాయో!! కానీ 2019లోనే కదా ఇలా జరిగింది?' అని మరొకరు అన్నారు. 'అభినందనలు. కానీ తికమక పడ్డాను. అతనికి 2019 అక్టోబర్‌లోనే పెళ్లైందని వికీపేజీలో ఉంది' అని ఇంకొకరు చెప్పారు. ' 'ఇది సరికాదు. అతనికి 2019లోనే పెళ్లైంది' అని మరో అభిమాని కామెంట్ చేశారు.
ప్రస్తుతం రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నాడు. తనను ఎప్పట్నుంచో ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. వాస్తవంగా 2019, అక్టోబర్‌లోనే ఫ్రానిస్కా పరెల్లొను నాదల్ పెళ్లాడాడు. ఆమెతోనే జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.