
బార్సిలోనా: కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక స్పెయిన్‌లో కూడా లాక్‌డౌన్ అమల్లో ఉంది. కానీ, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ మాత్రం క్లే కోర్టులో మరో వ్యక్తితో కలసి ప్రాక్టీస్ చేసి ఈ నిబంధనలను ఉల్లంఘించాడు. పైగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోలో పోస్టు చేశాడు. కాగా, ప్రొఫెషనల్ ఆటగాళ్లు తమంతట తాముగా లేదా కోచ్ ఆధ్వర్యంలో వ్యాయామాలు చేసుకోవడానికే అనుమతి ఉందని స్పానిష్ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. అంతేకానీ కోర్టులో ఆడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంక్షలు ఉల్లంఘించిన నొవాక్ జకోవిచ్‌పై జరిమానా విధిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది టెన్నిస్ లేనట్టే : నాదల్
కరోనా మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో... ఈ ఏడాది టెన్నిస్ టోర్నమెంట్‌లు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అభిప్రాయపడ్డాడు. 'వచ్చే ఏడాది జనవరికల్లా టెన్నిస్ టోర్నీలు మళ్లీ మొదలైతే నేను చాలా సంతోషిస్తా. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే అది కూడా సాకారం అయ్యేలా లేదు'అని తన కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ అన్నాడు. కరోనా కారణంగా ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దు కాగా... మేలో జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్‌కు వాయిదా పడిన విషయం తెలిసిందే.