French Open: ఫైనల్‌కు జ్వెరెవ్.. కొబోలితో ఢీ!
ఫ్రెంచ్ ఓపెన్‌లో జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో రెండోసీడ్ జ్వెరెవ్ 7-5, 6-2, 3-6, 6-3తో 26వ సీడ్ జాకుబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి జ్వెరెవ్ జోరు కనబర్చాడు. తొలి సెట్లో మెన్సిక్ కాస్త ప్రతిఘటించినా.. పదకొండో గేమ్‌లో సర్వీస్ బ్రేక్ చేసిన జ్వెరెవ్ సెట్ గెలిచాడు.
రెండో సెట్లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్స్ ఆడిన ఈ జర్మనీ స్టార్.. తేలిగ్గా రెండో సెట్‌నూ గెలిచాడు. మూడో సెట్‌లో మెన్సిక్ అనూహ్యంగా పుంజుకున్నాడు. ఆధిపత్యం చెలాయించి సెట్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. అయితే జ్వెరెవ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

నాలుగో సెట్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచాడు. జ్వెరెవ్ 8 ఏస్‌లతో పాటు 42 విన్నర్లు కొట్టాడు. 5 డబుల్ ఫాల్ట్స్, 41 అనవసర తప్పిదాలతో మెనిక్స్ మూల్యం చెల్లించుకున్నాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం 29 ఏళ్ల జ్వెరెవ్‌కు ఇది నాలుగోసారి. కాగా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండోసారి.
రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరినా అల్కారజ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే తుదిపోరులో 24 ఏళ్ల ఫ్లావియో కొబొలి (ఇటలీ)తో జ్వెరెవ్ తలపడతాడు. మరో సెమీస్‌లో తన దేశానికే చెందిన అర్నాల్డి వాకోవర్ ఇవ్వడంతో కొబొలి తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరాడు.
ఆండ్రీవా వర్సెస్ ఖాలీన్‌స్కా
నేడు(శనివారం) సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మహిళల సింగిల్స్ ఫైనల్లో 8వ సీడ్ మిర్రా ఆండ్రీవా, 114వ ర్యాంకర్ మాయా ఖాలీన్‌స్కా తలపడనున్నారు. ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం గమనార్హం.
19 ఏళ్ల ఆండ్రీవాకు ఇప్పటికే అనేక పర్యాయాలు అత్యుత్తమ క్రీడాకారిణులను ఓడించిన అనుభవం ఉండగా.. 24 ఏళ్ల ఖాలీన్‌స్కా ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు మేజర్ టోర్నీల్లో రెండోరౌండ్ దాటిన రికార్డు కూడా లేదు. ఈ ఇద్దరిలో ఎవరూ గెలిచినా ఫ్రెంచ్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలుస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications