French Open: జ్వెరెవ్ గెలిచెన్.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర!
జర్మనీ టెన్నిస్ట్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. 12 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ తొలి టైటిల్‌ను ముద్దాడాడు. ఫ్రెంచ్ ఓపెన్ 2026లో టాప్ సీడ్ ఆటగాళ్లు అల్కారజ్, సినర్, జొకోవిచ్‌ల అడ్డు లేకుండా ఫైనల్ చేరిన ఈ వరల్డ్ నెంబర్ 2 ప్లేయర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చివరకు విజేతగా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7(5-7), 6-1తో 10వ సీడ్ ఫ్లావియో కొబొల్లీ (ఇటలీ)పై పోరాడి గెలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో జ్వెరెవ్ అద్వితీయమైన ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాడు.
నాలుగో ఫైనల్లో విజయం..
29ఏళ్ల జ్వెరెవ్ తన నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ గెలవడం విశేషం. అతను తొలిసారిగా 2020లో యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరగా.. డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2024లో ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరుకు అర్హత సాధించినా.. అల్కారజ్ చేతిలో ఓడిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్ చేరినా.. జానిక్ సినర్ చేతిలో కంగుతిన్నాడు. కానీ ఈ పరాజయాల నుంచి పాఠం నేర్చుకున్న ఈ జర్మనీ ఆటగాడు ఈసారి మట్టికోర్టులో ప్రత్యర్థులను మట్టికరిపించాడు.

చుక్కలు చూపించి కొబోల్లీ..
దాదాపు 4 గంటల 16 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో పట్టువీడని విక్రమార్కుడిలా పోరాడాడు. తొలి సెట్‌ను బ్రేక్ పాయింట్‌తో ఆరంభించిన జ్వెరెవ్.. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మరో రెండుసార్లు ఫ్లావియో కొబొల్లీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, రెండో సెట్‌లో ఫ్లావియో పుంజుకొని 3-3తో సమంగా నిలిచాడు. అదే జోరును కొనసాగించి రెండో సెట్ కైవసం చేసుకున్నాడు.
మూడో సెట్‌లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోగా.. 10వ గేమ్‌లో జ్వెరెవ్ బ్రేక్ పాయింట్‌తో మూడో సెట్‌లో గెలిచి 2-1తో పైచేయి సాధించాడు. కానీ, నాలుగో సెట్‌లో హోరాహోరీగా పోరాడిన కొబొల్లీ 6-6తో సెట్ ఫలితాన్ని టైబ్రేక్ తీసుకెళ్లాడు. టైబ్రేక్‌లో కొబొల్లీ 7-5తో నెగ్గి నాలుగో సెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. దాంతో నిర్ణాయక ఐదో సెట్ ఆడాల్సి వచ్చింది. ఈ సెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన జ్వెరెవ్ ఏకపక్షంగా సెట్‌ను గెలిచి టైటిల్‌ను ముద్దాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

