ఫ్రెంచ్ ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియా టెక్ ఛాంపియన్‌గా నిలిచింది. ఎర్రమట్టిపై తన జోరును కొనసాగిస్తూ ఈ లేడీ నాదల్ హ్యాట్రిక్ నమోదు చేసింది. శనివారం ఏక పక్షంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల స్వియాటెక్ 6-2, 6-1 తేడాతో 12వ సీడ్ జాస్మిన్ పౌలినీ (ఇటలీ)ని ఓడించింది.
గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ తుది పోరులో స్వియా టెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి సెట్‌లో కాస్త తడబడి ఓ దశలో 1-2తో వెనుకంజలో నిలిచిన స్వియాటెక్.. ఆపై వరుసగా 10 గేములు గెలిచి మొదటి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్‌లో స్వియాటెక్ ధాటికి పౌలినీ పూర్తిగా చేతులెత్తేసింది.

ఏకంగా 5-0తో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన పోలెండ్ స్టార్.. ఆ సెట్‌ను మరింత సునాయసంగా ముగించడంతోపాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో స్వియాటెక్, జాస్మిన్ చెరో ఏస్ కొట్టగా..తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 28 ఏళ్ల పౌలినీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
స్వియటెక్ 18 విన్నర్లు కొడితే.. పౌలినీ ఏడింటికే పరిమితమైంది. స్వియటెక్‌కు రొలాండ్ గారోస్‌లో ఇది వరుసగా 21వ విజయం. 2022, 2023,2024ల్లో వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన స్వియాటెక్.. అంతకుముందు 2020లో కూడా విజేతగా నిలిచింది.
దాంతో జస్టిన్ హెనిన్ (2005, 06, 07)) తర్వాత హ్యాట్రిక్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు అందుకున్న తొలి క్రీడాకారిణిగా స్వియటెక్ రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలో ఇగాకు ఇది నాలుగో ఫ్రెంచ్ ఓపెన్ విజయం. ఓవరాల్‌గా స్వియాటెక్‌కు ఇది ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2022లో ఆమె యూఎస్ ఓపెన్ గెలిచింది. ఇక, గ్రాండ్‌స్లామ్స్‌లో ఫైనల్ చేరిన ప్రతిసారీ స్వియాటెక్ విజేతగా నిలవడం విశేషం.
ఈ టోర్నీలో విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 24 లక్షల యూరోలు(రూ. 22 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించింది. రన్నరప్ పౌలినీకి రూ. 10.82 కోట్ల క్యాష్ రివార్డ్ అందుకుంది.
నేడు జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల ఫైనల్లో స్పెయిన్ స్టార్ అల్కరాజ్, జర్మనీ ప్లేయర్ జ్వెరెవ్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ సాయంత్ర 6 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.