పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2023 టోర్నీలో బెలారస్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ ఎరీనా సబలెంక జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో సబలెంక సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక 6-4, 6-4 తేడాతో ఉక్రెయిన్ స్టార్ స్విటోలినాను ఓడించింది.
అసాధారణ ఆటతీరుతో చెలరేగిన సబలెంక వరుస సెట్లలో విజయం సాధించి స్విటోలినాను మట్టికరిపించింది. సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించడంతో స్విటోలినా కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రీకార్టర్స్‌లో రెండో సీడ్ ఎరీనా సబలెంక (బెలారస్) 7-6 (7/5), 6-4తో అమెరికన్ సీడెడ్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఆమె 6-3, 6-1తో అమెరికాకు చెందిన పెరాను చిత్తు చేసింది. ఆరో సీడ్ కొకో గాఫ్ (అమెరికా) కూడా క్వార్టర్స్‌లో చోటు సంపాదించింది. నాలుగో రౌండ్లో ఆమె 7-5, 6-2తో ష్మీద్లోవా (స్లొవేకియా)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ రూడ్ (నార్వే) క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్లో అతడు 7-6 (7-3), 7-5, 7-5తో జారీ (చిలీ)ని ఓడించాడు.
మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించిన రూడ్.. 30 విన్నర్లు కొట్టాడు. జారీ గట్టి పోటీ ఇచ్చినా.. 67 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఆరో సీడ్ రూన్ (డెన్మార్క్) కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాడు. హోరాహోరీ మ్యాచ్‌లో అతడు 7-6 (7-3), 3-6, 6-4, 1-6, 7-6 (10-6)తో సెరుండొలో (అర్జెంటీనా)ను ఓడించాడు.మరో ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 7-5, 6-3, 6-0తో ఆఫ్నర్ (ఆస్ట్రియా)ను మట్టికరిపించాడు.