
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ 2022 సెమీఫైనల్ మ్యాచ్‌ను అడ్డుకొని ఓ మహిళా తన నిరసన వ్యక్తం చేసింది. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య గురువారం ఫిలిప్ చార్టియర్ కోర్ట్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుండగా.. సదరు మహిళ కోర్ట్‌లోకి దూసుకొచి తనను తానే కట్టేసుకుంది. ఇనుప వైర్లతో ఆమె నెట్‌కు ముడులు వేసుకున్నది. ఈ ఊహించని ఘటనతో సుమారు 13 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది.
ఆ మహిళ నినాదాలతో ఉన్న ఓ టీ షర్ట్ ధరించింది. 'మనకు ఇంకా 1028 రోజులు ఉన్నాయి'అని ఆ టీషర్ట్‌పై రాసి ఉంది. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే ఇనుప వైర్లను తొలగించి ఆమెను బయటకు తీసుకెళ్లారు.
కోర్ట్‌లోకి దూసుకువచ్చిన ఆ మహిళను పర్యావరణ కార్యకర్తని తెలిసింది. 22 ఏళ్ల అల్జీగా గుర్తించారు. డెర్నిర్ రెనోవేషన్ సంస్థకు చెందినట్లు భావిస్తున్నారు. క్లైమేట్ ఎమర్జెన్సీపై ఆమె ప్రచారం నిర్వహిస్తోంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు సరైన టికెట్‌తోనే ఆమె స్టేడియంలోకి ఎంటరైనట్లు గుర్తించారు.
ఇక ఈ మ్యాచ్‌లో రూడ్ 3-6, 6-4. 6-2, 6-2 తేడాతో సిలిచ్‌ను ఓడించాడు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్‌తో రూడ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి సెమీఫైనల్లో నాదల్ 7-6 (10/8), 6-6తో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వేరెవ్‌ను ఓడించాడు. రెండో సెట్ 12వ గేమ్‌లో నాదల్ రిటర్న్ షాట్‌ను అందుకోనే క్రమంలో బేస్‌లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్‌ను విజేతగా ప్రకటించారు.