
ఫెడరర్ ఆగ్రహం..
పదునైన ఏస్‌లతో పాటు... బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తొలి సెట్‌ను అలవోకగా నెగ్గాడు. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న సిలిచ్ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక మూడో సెట్ 'టై బ్రేక్'కు దారితీయగా... అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురికాని ఫెడరర్ 'టై బ్రేక్' ద్వారా మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఫెడరర్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 16 ఏస్‌లు సంధించి... ఒకే ఒక్క డబుల్ ఫాల్ట్ చేశాడు. సిలిచ్ 12 ఏస్‌లు కొట్టినా కీలక సమయాల్లో ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌లో టైమ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫెడెక్స్‌కు చైర్ అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అంపైర్‌తో వాదనకు దిగడంతో ఐదు నిమిషాలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

జొకోవిచ్, స్వియాటెక్ కూడా...
రెండో రౌండ్ పోరులో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో పబ్లో క్వెవాజ్ (ఉరుగ్వే)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఎక్కడా తడబాటుకు గురికాకుండా మ్యాచ్‌ను ముగించేశాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) 3-6, 6-1, 6-4, 6-3తో టామీ పాల్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ అలవోకగా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. ఎనిమిదో సీడ్ స్వియాటెక్ 6-1, 6-1తో 61 నిమిషాల్లో రెబెకా పీటర్సన్ (స్వీడన్)ను అలవోకగా ఓడించింది.

బార్టీ అవుట్..:
2019 చాంపియన్ బార్టీ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. తుంటి నొప్పి కారణంగా రెండో రౌండ్ మ్యాచ్ మధ్యలోనే రిటైరైంది. పోలెండ్ ప్లేయర్ మగ్దా లిన్నెట్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అమ్మాయి బార్టీ 6-1, 2-2తో ఉన్న సమయంలో తాను ఆడలేనని అంపైర్‌కు సంజ్ఞ చేసింది. మ్యాచ్ ఆరంభానికి ముందు ఆమె ఎడమ తొడకు భారీగా బ్యాండేజ్ వేసుకొని కనిపించింది. తొలి సెట్ నెగ్గిన తర్వాత మెడికల్ టైమౌట్ తీసుకొన్నా.. ఆ తర్వాత కూడా ఆటను కొనసాగించలేక పోయింది. ఇక ఐదో సీడ్ ఎలెనా స్విటోలినా 6-0, 6-4తో అన్నె లి (అమెరికా)పై, కరోలినా ముచోవా 6-3, 6-4తో వార్వరా లెప్‌చెంకో (అమెరికా)పై, మరియా సక్కారి 6-2, 6-3తో జాస్మిన్‌పై, కొకొ గాఫ్ 6-3, 7-6(1)తో వాంగ్ కియాంగ్‌పై నెగ్గారు. 9వ సీడ్ కరోలినా ప్లిస్కోవా 5-7, 1-6తో స్లోన్ స్టీఫెన్స్ చేతిలో ఓడింది.

మూడో రౌండ్‌కు బోపన్న జోడీ..
డబుల్స్‌లో రోహన్ బోపన్న జంట ప్రీ క్వార్టర్స్‌కు చేరుకొంది. రెండో రౌండ్‌లో బోపన్న-ఫ్రాంకో కుగర్ (క్రొయేషియా) ద్వయం 6-4, 7-5తో అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టైఫో-నికోలస్ మన్రోపై నెగ్గింది. ప్రస్తుతం డబుల్స్‌లో 40వ ర్యాంకులో ఉన్న బోపన్నకు ర్యాంకింగ్ పాయింట్లు పెంచుకోవాలంటే రొలాండ్ గారోస్‌లో మరింత ముందుకెళ్లడం అవసరం. జూన్ 10 నాటికి ర్యాంకింగ్‌ను బట్టి టోక్యో బెర్తులు నిర్ణయమవుతాయి.

కరోనా కలకలం..
ఫ్రెంచ్ ఓపెన్‌కు కరోనా సెగ తగిలింది. ఓ డబుల్స్ జోడీ పాజిటివ్‌గా తేలింది. వాళ్లెవరన్నది నిర్వాహకులు చెప్పలేదు. అయితే ఆ ఇద్దరు క్రీడాకారులను టోర్నీ నుంచి తప్పించి క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. వీరికి బదులు జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న మరో జంటకు టోర్నీలో ఆడే అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 2446 పరీక్షలు చేయగా.. ఇద్దరికి కొవిడ్ సోకినట్లు వెల్లడైందని ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ తెలిపింది.


Click it and Unblock the Notifications
