French Open 2021: నాదల్, సెరెనా, బార్టీ శుభారంభం!

పారిస్: క్లే కోర్టు కింగ్, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫస్ట్ రౌండ్‌లో మూడో సీడ్ నాదల్ 6-3, 6-2, 7-6 (7/3)తో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పాప్రిన్ పై నెగ్గాడు. 2 గంటల 23 నిమిషా పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ తొలి రెండు సెట్లను సులభంగానే నెగ్గాడు. ఫస్ట్ సెట్‌లో ఒకటి, సెకండ్ సెట్‌లో రెండు బ్రేక్ పాయింట్లు సాధించాడు. అయితే మూడో సెట్లో పాప్రిన్ పరీక్ష పెట్టాడు.
ఒక దశలో 5-2తో సెట్ గెలిచేలా కనిపించాడు. కానీ తన శైలిలో పుంజుకున్న నాదల్.. సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించి విజయాన్ని అందుకున్నాడు. ఇతర మ్యాచ్‌లో రష్యా కుర్రాడు రుబ్‌లెవ్‌కు షాక్ తగిలింది. ఏడో సీడ్ రుబ్‌లెవ్ 3-6, 6-7 (6/8), 6-4, 6-3, 4-6తో స్ట్రాఫ్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్), ష్వార్జ్‌మాన్ (అర్జెంటీనా), కరాత్సెవ్ (రష్యా, డిమెనార్ (ఆస్ట్రేలియా) కూడా రెండో రౌండ్ చేరారు.

బోపన్న జోడీ ముందంజ..
పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. క్రొయేషియా ప్లేయర్ ప్రాకో సుగోర్‌తో జోడీ కట్టిన అతను రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో బోపన్న-ఫ్రాంకో 6-4, 6-2తో బెంజిమన్ (జర్మనీ)-బాసిల్‌ష్వెలి (జార్జియా) జంటను ఓడించింది. తొలి సెట్‌లో ఒకసారి, సెకండ్ సెట్‌లో రెండు సార్లుప ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ముందంజ వేసింది.

బార్టీ, సెరెనా ముందుంజ..
మహిళల సింగిల్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ గట్టెక్కింది. తొలి రౌండ్లో బార్టీ 6-4, 3-6, 6-2తో అమెరికా అమ్మాయి బెర్నార్డా పెరాపై గెలిచింది. పెద్దగా ఇబ్బంది పడకుండానే తొలి సెట్‌ను గెలిచిన బార్టీ రెండో సెట్లో తడబడింది. మోకాలి గాయం బాధిస్తుండడంతో కోర్టులో కదలడానికి చాలా ఇబ్బంది పడింది. కాలికి కట్టు కట్టుకుని ఆడిన ఆమె 3-6తో సెట్ కోల్పోయింది. మూడో సెట్లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన బార్టీ నెమ్మదిగా పుంజుకుంది. ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరుతో తర్వాత రెండు గేమ్‌లు కూడా సొంతం చేసుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. 2019లో ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన బార్టీ.. గతేడాది టోర్నీకి దూరమైంది.

సెరెనా శుభారంభం..
24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభాన్ని అందుకుంది. ఏడో సీడ్ సెరెనా 7-6 (8/6), 6-2తో ఇరినా బెగు (రొమేనియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరింది. ఐదో సీడ్ స్వితోలినా కూడా ముందంజ వేసింది. స్వితోలినా 6-2, 7-5తో బాబెల్ (ఫ్రాన్స్)ను ఓడించింది. మ్లదనోవిచ్ (ఫ్రాన్స్), సకారి (గ్రీస్) కూడా తొలి రౌండ్ అధిగమించారు. మ్లదనోవిచ్ 6-4, 6-0తో సిమిద్లోవా (స్లోవేకియా)ను ఓడించగా.. సకారి 6-4, 6-1తో జవాస్కా (ఉక్రెయిన్)పై నెగ్గింది. మరోవైపు అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, ముగురుజ (స్పెయిన్) ఓడిపోయారు. తొలి రౌండ్లో వీనస్ 3-6, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో చిత్తు కాగా.. పన్నెండో సీడ్ ముగురుజ 1-6, 4-6తో మార్టా (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications