ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్-2 సీడ్ అల్కరాజ్ 6-4, 5-7, 6-3, 7-6(6) అమెరికాకు చెందిన ఐదో సీడ్ ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు.
2 గంటల 49 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్, టేలర్ ఫ్రిట్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. చివరి అల్కరాజ్ గెలుపొంది ఫైనల్ చేరాడు. వరుసగా మూడో టైటిల్ గెలిచి ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచేందుకు అల్కరాజ్ అడుగు దూరంలో నిలిచాడు. అల్కరాజ్ కంటే ముందు జోర్న్ బోర్గ్, పీటర్ సంప్రాస్, రోజర్ ఫెడరర్, నొవాక్ జకోవిచ్ వరుసగా మూడు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచారు.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ తన అనుభవాన్ని ఉపయోగించుకొని విజయాన్నందుకున్నాడు. తొలి సెట్ గెలిచిన అల్కరాజ్.. రెండో సెట్‌ను తీవ్రంగా పోటీపడి చేజార్చుకున్నాడు. మూడో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకున్న అల్కరాజ్‌కు నాలుగో సెట్‌లో అసలు సిసలు పరీక్ష ఎదురైంది. నాలుగో సెట్ టై-బ్రేక్‌లో 4-6 తో రెండు సెట్ పాయింట్లను కాపాడుకొని, వరుసగా నాలుగు పాయింట్లను గెలిచి మ్యాచ్‌ను ముగించాడు.
అల్కరాజ్ తన తొలి సర్వీస్‌లో 88 శాతం పాయింట్లను గెలుచుకున్నాడు. బేస్‌లైన్ నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, అద్భుతమైన డ్రాప్ షాట్స్, బలమైన సర్వ్‌లతో ఫ్రిట్జ్‌ను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 13 ఏస్‌లు సాధించి 7 డబుల్ ఫాల్ట్స్ చేసాడు. టేలర్ ఫ్రిట్జ్ 19 ఏస్‌లు కొట్టినప్పటికీ అల్కరాజ్ అతనికి ఏ మాత్రం అవకాశం లేదు.