ఆస్ట్రేలియా ఓపెన్ 2025 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో పోలెండ్ భామ, రెండో సీడ్ ఇగా స్వైటెక్ పోరాటం ముగిసింది. ఒక్కటంటే ఒక్క సెట్టు కూడా చేజార్చుకోకుండా సెమీఫైనల్ చేరిన ఈ పోలాండ్ బ్యూటీ.. కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడింది. 19వ సీడ్ అమెరికన్ మాడిసన్ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో స్వైటెక్ ఓటమిపాలైంది.
కొంపముంచిన తప్పిదం..
మాడిసన్ కీస్ 5-7, 6-1, 7-6 (8)తో స్వైటెక్‌కు షాకిచ్చింది. మూడు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ సెమీఫైనల్లో ఐదు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ స్వైటెక్ ఒకే ఒక్క తప్పిదంతో మూల్యం చెల్లించుకుంది. మూడో సెట్‌లో..మ్యాచ్ పాయింట్‌పై నిలిచిన స్వైటెక్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌ను సరిగా కొట్టలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కీస్ 7 ఏస్‌లతో పాటు 36 విన్నర్లు కొట్టింది. 40 అనవసర తప్పిదాలు, 7 డబుల్‌ఫాల్ట్స్ చేసిన స్వైటెక్ పరాజయం చవిచూసింది.

సలెంక ముందంజ..
మరో సెమీస్‌లో టాప్ సీడ్ బెలారస్ స్టార్ సబలెంక 6-4, 6-2తో 11వ సీడ్ పౌలా బడోసా (స్పెయిన్)పై సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో సబలెంకా 2 ఏస్‌లతో పాటు 32 విన్నర్లు కొట్టింది. ఈ గెలుపుతో సబలెంకా వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది.
అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో వరుసగా మూడు సార్లు ఫైనల్ చేరిన ప్లేయర్‌గా సబలెంక నిలిచింది. సెరెనా విలియమ్స్ 2015-17 మధ్య వరుసగా మూడు సార్లు ఫైనల్ చేరింది. శనివారం జరిగే ఫైనల్లో కీస్‌తో సబలెంక తలపడనుంది.
జకోవిచ్ X జ్వెరెవ్..
పురుషుల సింగిల్స్ తొలి సెమీ ఫైనల్లో సెర్బియా స్టార్, ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్, రెండో సీడ్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. రెండో సెమీస్‌లో టాస్ సీడ్, డిఫెండింగ్ ఛాంపియన్ సినర్, అమెరికా సంచలన బెన్ షెల్టన్‌తో తలపడనున్నాడు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంతో జకోవిచ్ బరిలోకి దిగుతుండగా.. వరుసగా రెండో టైటిల్ గెలవాలని జానిక్ సినర్ భావిస్తున్నాడు.