ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సుమిత్ నగాల్ 6-2, 3-6, 5-7, 4-6 తేడాతో చైనా ప్లేయర్ జున్‌చెంగ్ షాంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2 గంటల 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ తేలిపోయాడు.
అసాధారణ ప్రదర్శనతో తొలి సెట్‌ను సొంతం చేసుకొని శుభారంభం చేసిన అతను అనవసర తప్పిదాలతో వరుసగా మూడు సెట్లలో ఓడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. దాంతో సుమిత్ నగాల్ సంచలన ప్రదర్శనకు రెండో రౌండ్‌లోనే తెరపడింది.

మూడేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి అర్హత సాధించిన సుమిత్ నగాల్... రెండో రౌండ్ చేరుకోవడం ద్వారా రూ. 98 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నాడు. గత మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సుమిత్ నగాల్ 6-4, 6-2, 7-6( 7-5)తో 27వ ర్యాంకర్ అలెగ్జండర్ బబ్లిక్(కజకిస్థాన్)ను ఓడించాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిని ఓడించిన భారత ఆటగాడిగా నగాల్ చరిత్రకెక్కాడు. 1989లో భారత టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్.. అప్పటి వరల్డ్ నెంబర్ 1 మ్యాట్స్ విలాండర్‌ను రెండో రౌండ్‌లో ఓడించాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ 2021లో అతను తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ఏ భారత ఆటగాడు మూడో రౌండ్ దాటలేదు. భారత్ తరఫున రమేశ్ కృష్ణన్ మాత్రమే మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆయన తన కెరీర్‌లో ఐదు సార్లు మూడో రౌండ్ వరకు వెళ్లాడు. 1983, 84, 87, 88, 89లో రమేశ్ కృష్ణన్ మూడో రౌండ్‌లో ఓడాడు. భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, విజయ్ అమృతరాజ్ రెండో రౌండ్‌లోనే ఇంటి బాట పట్టారు.