ఆస్ట్రేలియా ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఘోర పరాజయం ఎదుర్కొన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జకోవిచ్ 1-6, 2-6, 7-6(8/6), 3-6 తేడాతో ఇటాలియన్ ప్లేయర్ జాన్నిక్ సిన్నర్ చేతిలో చిత్తయ్యాడు.
టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ వన్ జకోవిచ్‌ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. 22 ఏళ్ల సిన్నర్ ఆట ముందు తేలిపోయిన జకోవిచ్.. తొలి రెండు సెట్లలో చిత్తయ్యాడు. కీలక మూడో సెట్‌లో జకోవిచ్ ధీటుగా బదులివ్వడంతో టై బ్రేక్‌కు దారి తీసింది. హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో చివరకు జకోవిచ్ పై చేయి సాధించాడు.

నాలుగో సెట్‌లో మరింత చెలరేగిన సిన్నర్ భారీ తేడాతో జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ ఏకంగా 54 తప్పిదాలు చేశాడు. సిన్నర్ సర్వ్‌ను బ్రేక్ చేయడంలోనూ జకోవిచ్ విఫలమయ్యాడు.
ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ తడబడుతూనే సెమీస్ చేరాడు. ఈ సీజన్‌లో అతను చాలా సార్లు వరుస సెట్లను కోల్పోయాడు. అనారోగ్యంతో బాధపడుతుండటం కూడా జకోవిచ్ పరాజయానికి బాటలు వేసింది.
ఈ గెలుపుతో సిన్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. మైదానం మొత్తం జకోవిచ్‌కు మద్దతు తెలిపినా.. ఏ మాత్రం ప్రశాంతత కోల్పోని సిన్నర్ అసాధారణ ప్రదర్శనతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ పరాజయంతో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం చేసుకోవాలనుకున్న నొవాక్ జకోవిచ్ ఆలోచనకు బ్రేక్ పడింది. గోల్డెన్ స్లామ్ గెలిచే అవకాశాన్ని కూడా జకోవిచ్ చేజార్చుకున్నాడు. గతేడాది నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో మూడు గెలిచిన జకోవిచ్.. వింబుల్డన్ టోర్నీలో మాత్రమే విజేతగా నిలవలేకపోయాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలోనే జకోవిచ్‌కు చుక్కెదురైంది.