
మరో సంచలనం
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెకండ్ రౌండ్‌లో అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6-3, 6-2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్‌లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-1, 7-6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది.
తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6-4, 6-3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7-5, 2-6, 6-4తో స్వెత్లానా కుజ్‌నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది.

ముగిసిన భారత పోరాటం..
భారత జోడీలకు సీజన్ ప్రారంభ టోర్నీలో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1-6, 4-6తో యనిక్ హన్‌ఫన్- కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత-మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3-6, 0-6తో ఒలివియా గడెకి-బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది.

మూడో రౌండ్‌కు నాదల్..
21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6-1, 6-4, 6-2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటుశ్రమించాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6-7 (5/7), 6-4, 6-1, 6-7 (5/7), 6-4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ముందంజ వేసాడు.

మెద్వెదెవ్ ముందంజ..
నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-2, 7-5, 6-1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6-4, 6-4, 7-6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6-3, 6-2, 4-6, 6-3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4-6, 6-2, 2-6, 6-3, 7-6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6-2, 5-7, 6-1, 6-4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు.


Click it and Unblock the Notifications












