Australia Open 2021: సెరెనా ఈ సారైనా..? ఎవరిదో కొత్త చరిత్ర? బరిలో నలుగురు ఇండియన్స్!

మెల్‌బోర్న్: కరోనా కష్టాలు దాటుకుని టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులు జొకోవిచ్ (సెర్బియా), రాఫెల్ నాదల్ (స్పెయిన్), సెరెనా విలియమ్స్ (అమెరికా) కొత్త చరిత్ర లిఖించేందుకు బరిలోకి దిగుతున్నారు. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా.. చివరి రెండేళ్ల నుంచి ఎంత పోరాడినా మార్గరేట్ కోర్ట్(24 గ్రాండ్ స్లామ్స్) రికార్డును సమం చేయలేకపోయింది. 2017లో చివరిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దాంతో ఈ సారి ఎలాగైనా తన కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

గెలిస్తే చరిత్రే..
నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 66వ ర్యాంకర్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)తో టాప్ సీడ్ జొకోవిచ్ తలపడనున్నాడు. ఒకవేళ ఈ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిస్తే అత్యధికంగా తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతాడు. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ చాంపియన్‌గా నిలిస్తే పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ప్రస్తుతం ఫెదరర్, నాదల్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగే తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్ లాస్లో జెరి (సెర్బియా)తో నాదల్ ఆడనున్నాడు. జొకోవిచ్, నాదల్‌తోపాటు ప్రస్తుత యూఎస్ ఓపెన్ చాంపియన్, మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు.

టఫ్ ఫైట్..
మహిళల సింగిల్స్ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఏ ఒక్కరినీ కచ్చితమైన ఫేవరెట్ అని పేర్కొనే పరిస్థితి కనిపించడంలేదు. డిఫెండింగ్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో ర్యాంకర్ నవోమి ఒసాకా (జపాన్), రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా), 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు.ఈ ఐదుగురితోపాటు మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్), ఐదో ర్యాంకర్ స్వితోలినా (ఉక్రెయిన్), తొమ్మిదో ర్యాంకర్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాజీ విజేత కెర్బర్ (జర్మనీ) కూడా టైటిల్ గెలిచే అవకాశాలున్నాయి. సోమవారం జరిగే తొలి రౌండ్‌లో లౌరా సిగెమండ్ (జర్మనీ)తో సెరెనా, పావ్లీచెంకోవా (రష్యా)తో ఒసాకా ఆడతారు.

బరిలో నలుగురు ఇండియన్స్..
భారత్ నుంచి సుమిత్ నగాల్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, అంకిత రైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సింగిల్స్ మెయిన్ డ్రాలో ప్లేస్ దక్కించుకోలేకపోయిన అంకితా డబుల్స్‌లో ఆడనుంది. చివరి నిమిషంలో మిహేలా బుజర్నెస్(రొమేనియా)తో జతకట్టిన అంకిత మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగనుంది. దీంతో ఓపెన్ ఎరాలో గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయిన ఐదో భారత మహిళా ప్లేయర్‌గా రికార్డులుకెక్కింది. మరోపక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కించుకున్న సుమిత్ మంగళవారం జరిగే తన తొలి మ్యాచ్‌లో రికార్డస్ బెరాంకిస్‌తో తలపడనున్నాడు. బోపన్న, దివిజ్ వేర్వేరు భాగస్వాములతో కలిసి బరిలోకి దిగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications