ఆస్ట్రేలియా ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో 10 సార్లు ఛాంపియన్, ఆరో సీడ్ అయిన నోవాక్ జకోవిచ్‌ను ఓడించాడు.
ఈ గెలుపుతో కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను అందుకున్నాడు. తద్వారా నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను (ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్) గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా అల్కరాజ్ చరిత్రకెక్కాడు. 22 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ సాధించి రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. నాదల్ 24 ఏళ్ల వయసులో ఈ ఘనతను అందుకున్నాడు.
సుమారు 3 గంటల పాటు సాగిన ఫైనల్లో జకోవిచ్, అల్కరాజ్ హోరాహోరీగా తలపడ్డారు. తొలి సెట్‌లో జకోవిచ్ తన అనుభవంతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అల్కరాజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6-2తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు.
తొలి సెట్ కోల్పోయినా ఏ మాత్రం నిరాశకు గురికాని అల్కరాజ్.. రెండో సెట్‌లో దూకుడుగా ఆడాడు. జకోవిచ్ సర్వీసులను బ్రేక్ చేసి 6-2తో రెండో సెట్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను సమం చేశాడు. మూడో సెట్‌లోనూ అదే జోరును కొనసాగించిన స్పెయిన్ స్టార్, వరుస విన్నర్లతో జకోవిచ్‌ను ఒత్తిడిలోకి నెట్టి 6-3తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆఖరి సెట్ మరింత ఉత్కంఠగా సాగగా.. స్కోరు 5-5 వద్ద ఉన్నప్పుడు అల్కరాజ్ అద్భుతమైన ఆటతీరుతో జకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 7-5తో సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంతో అల్కరాజ్ సుమారు రూ.26.5 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత అల్కరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.'కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేయడం ఒక కలలా ఉంది. అది కూడా జకోవిచ్‌ను ఓడించి ఈ కలను సాకారం చేసుకోవడం మరింత ప్రత్యేకం'అని తెలిపాడు.
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించాలనుకున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే, మార్గరెట్ కోర్ట్ (24 టైటిళ్లు) రికార్డును అధిగమించి, టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా జకోవిచ్ నిలిచేవాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌కు ఇదే తొలి ఓటమి. ఈ టోర్నీలో గతంలో 10 సార్లు ఫైనల్ చేరితే 10 సార్లు విజేతగా నిలిచాడు. కానీ ఈ సారి ఓటమిపాలయ్యాడు.