భారతదేశంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారికి మారుతి సుజుకి కార్స్ అంటే ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో మారుతి దిట్ట. అయితే మారుతి సుజుకికి చెందిన సెలీరియో (Celerio) విషయంలో మాత్రం లెక్కలు మారుతున్నాయి.
అద్భుతమైన ఫీచర్లు, బైక్ రేంజ్ మైలేజ్ ఉన్నప్పటికీ, ఈ కారు అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అసలు ఈ కారు ప్రత్యేకతలు ఏంటి? జనం ఎందుకు దీనిపై ఆసక్తి చూపడం లేదో వివరంగా తెలుసుకుందాం.

తాజా గణాంకాల ప్రకారం (జనవరి 2026) మారుతి సుజుకి సెలీరియో కేవలం 1,501 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు ఏకంగా 23.18 శాతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం మారుతున్న కస్టమర్ల అభిరుచి. ప్రస్తుతం మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీల హవా నడుస్తోంది.
సెలీరియో ధర కంటే కొంచెం ఎక్కువ పెడితే టాటా పంచ్ లేదా మారుతి ఫ్రాంక్స్ వంటి ఎస్‌యూవీలు వస్తుండటంతో, జనం హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సెలీరియో డిజైన్ కొంచెం పాతబడటం కూడా అమ్మకాలు తగ్గడానికి ఒక కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ కారు పెట్రోల్ వేరియంట్ 24 కి.మీ ఇవ్వగా, సీఎన్‌జీ (CNG) వేరియంట్ ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది బైక్ మైలేజీతో సమానం. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. 313 లీటర్ల బూట్ స్పేస్ లగేజ్ కోసం అందుబాటులో ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టార్ట్/స్టాప్ బటన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

సెలీరియో తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం మైలేజ్ మీదనే ఆధారపడకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా బోల్డ్ డిజైన్, మరిన్ని ప్రీమియం ఫీచర్లతో అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే, మైలేజ్ పరంగా రారాజుగా ఉన్నా, అమ్మకాల రేసులో వెనుకబడక తప్పదు.
Credit: Drivespark