న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యూడబ్ల్యూడబ్ల్యూ) మద్దతు తెలిపింది. గత నెల పదిహేను రోజు దేశ రాజధాని ఢిల్లీలో భారత స్టార్ రెజర్లు చేస్తున్న ఆందోళనలను ఎవరు పట్టించుకోకపోయినా.. యూడబ్ల్యూడబ్ల్యూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత స్టార్ రెజ్లర్లపై పోలీసు చర్యను తీవ్రంగా ఖండించింది. టాప్‌స్టార్లపై పోలీసు జులుంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్‌లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది.

లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఒలింపిక్, ఆసియా క్రీడల పతక విజేతలు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా వెల్లడించింది.
గతంలో ప్రకటించినట్లుగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య హెచ్చరించింది.
ఇక తమ ఆందోళనలను ప్రభుత్వంతో పాటు ఇతర క్రీడాకారులు కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భారత రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో పడేయాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ చివరకు అది జరగలేదు. సన్నిహితుల సముదాయింపుతో చివరు ఆ నిర్ణయాన్ని రెజర్లు ఉపసంహరించుకున్నారు.
మంగళవారం హరిద్వార్‌లో సుదీర్ఘ సమయం పాటు ఈ హైడ్రామా చోటు చేసుకుంది. మంగళవారం వందల సంఖ్యలో వచ్చిన మద్దతుదారులతో కలిసి చేతిలో పతకాలతో వీరంతా హరిద్వార్ చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మలిక్, బజరంగ్ పూనియా... ప్రపంచ చాంపియన్‌షి ప్‌లో పతకం సాధించిన వినేశ్ ఫొగాట్, సంగీత, వీరి బంధుమిత్రులు, అభిమానులు హర్ కి పౌరి వద్దకు చేరుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందేనని నిరసన చేపట్టారు.
రెజ్లర్లు పతకాలను చేత పట్టుకొని గంగపాలు చేయాలనుకున్నారు. పలువురు బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని పవిత్రమైన గంగానదిలో ఇలాంటి చర్యలను అనుమతించమని వాదించారు. గంటా 45 నిమిషాల పాటు ఈ హైడ్రామా నడిచింది. రెజ్లర్ల సన్నిహితులు తీవ్రమైన నిర్ణయం వద్దని వారించడంతో చివరకు వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.