రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) నూతన ప్యానెల్ ఎన్నికను నిరసిస్తూ భారత స్టార్ రెజ్లర్లు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా.. బజరంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశాడు. తాజాగా వినేశ్ ఫొగాట్ ఈ జాబితాలో చేరింది.
తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన బహిరంగ లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రభుత్వ ప్రకటనల ప్రచారం కోసమే మహిళా రెజ్లర్లను తయారు చేశారా? అని ప్రశ్నించారు.

తాను గౌరవంగా జీవించే ప్రయాణంలో భారం కాకుడదనే ఉద్దేశంతోనే ఖేల్‌రత్న, అర్జున అవార్డలను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ పేర్కొంది. వినేశ్ షొగాట్.. కాన్వెల్త్, ఆసియా క్రీడల్లో గోల్డ్ మొడల్ సాధించింది.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దాంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.
తాజాగా జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ప్రధాన అనుచరుడు అయిన సంజయ్ కుమార్ సింగ్ గెలుపొందాడు. మహిళా రెజ్లర్ల నిరసనకు అండగా నిలిచిన మాజీ రెజ్లర్ అనితా షెరాన్‌పై ఆయన విజయం సాధించాడు. దాంతో భారత రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. చేసేదేం లేక కొందరు ఆటకు వీడ్కోలు పలుకుతుంటే మరికొందరు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు.
ఇక డబ్ల్యూఎఫ్‌ఐ అత్యుత్సాహం ప్రదర్శించడంతో కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. డబ్ల్యూఎఫ్‌ఐ రూల్స్‌కు భిన్నంగా ఈ నెల 28 నుంచి అండర్ 15, 20 నేషనల్ చాంపియన్స్ నిర్వహిస్తామని ప్రకటించడం.. విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది.