న్యూఢిల్లీ: రెజ్లర్ల పోరాటం మరో మలుపు తీసుకుంది. స్టార్ రెజ్లర్లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ ఎంపీ, కావన్వెల్త్ క్రీడల గోల్డ్‌మెడలిస్ట్ బబితా ఫోగాట్ తన స్వార్థం కోసం రెజ్లర్ల నిరసనను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందని ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ ఆరోపించింది.
అసలు జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి తీసుకున్నదే బబితా ఫోగాట్ అని తెలిపిన సాక్షి మాలిక్.. తన భర్త్ సత్యవర్త్ కడియన్‌తో కలిసి ఓ సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బబతా ఫోగాట్‌తో పాటు మరో బీజేపీ నాయకుడు తీర్థ్ రాణా కలిసి రెజ్లర్ల ఉద్యమానికి ఉసి గొల్పి పక్కకు తప్పుకున్నారని పేర్కొంది.

'వీడియోలో బీజేపీ నాయకులు తీర్థ్ రాణా, బబితా ఫొగాట్ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రెజ్లర్లను ఉపయోగించుకోవడానికి ఎలా ప్రయత్నించారో వివరించాం. రెజ్లర్లు సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్లు ప్రభుత్వానికి ఎలా అనుకూలంగా వ్యవహరించారో చెప్పాం'' అని ఆదివారం సాక్షి మాలిక్ ఆ వీడియోను ట్వీట్ చేసింది.
మరోవైపు ఈ ఆరోపణలను బబితా ఫోగాట్ ఖండించింది. రెజ్లర్లు జనవరిలో నిరసన చేసినప్పుడు వారికి, ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం చేసిన బబితా.. సాక్షి ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. 'సాక్షి, సత్యవర్త్‌ల వీడియో నన్ను బాధించింది. అదే సమయంలో నవ్వొచ్చింది. పోలీసుల అనుమతి కోరుతూ సమర్పించిన లేఖపై నా సంతకం లేదు.
దాంతో నాకు సంబంధం లేదు. తొలి రోజు నుంచే నేను రెజ్లర్ల నిరసనకు అనుకూలం కాదు. ప్రధాని లేదా హోంమంత్రిని కలవమని వాళ్లకు చెప్పినా.. దీపేందర్ హుడా, కాంగ్రెస్, ప్రియాంక గాంధీల వద్ద పరిష్కారం లభిస్తుందని వారు భావించారు.'అని బబితా ఫోగాట్ చెప్పుకొచ్చింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు గత 6 నెలలకు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చలు జరిపిన రెజ్లర్లు నిష్పాక్షికమైన విచారణ చేపడుతామని హామీ ఇవ్వడంతో తమ నిరసనలకు బ్రేక్ ఇచ్చారు.