World Athletics Championships: మెడల్స్‌లోనూ అగ్రరాజ్యమే.. 33 పతకాలతో..

యుజీన్ (అమెరికా): వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన అగ్రరాజ్యం అమెరికా పతకాల్లో టాప్ లేపింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలు కైవసం చేసుకుంది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు సృష్టించింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది.
ఇథిపియా 4 గోల్డ్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ 10 పతకాలు నెగ్గి రెండో స్థానంలో నిలవగా.. జమైకా రెండు గోల్డ్, 7 సిల్వర్, 1 బ్రాంజ్‌తో 10 పతకాలు మూడో ప్లేస్ సాధించింది ఈ పోటీల్లో అమెరికా మూడు ఈవెంట్లను(పురుషుల 100 మీటర్లు, 200 మీటర్లు, షాట్ పుట్) క్లీన్ స్వీప్ చేయడం గమనార్హం.

రెండు ప్రపంచ రికార్డులు..
పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్‌లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరగగా.. అమెరికా 3 గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక సిల్వర్ సాధించింది.

అమెరికా జోరు..
మహిళల 4X 400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4X400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు.

గోల్డ్ మెడల్‌తో ఫెలిక్స్ రిటైర్...
అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను గోల్డ్ మెడల్‌తో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4X400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4X400 మిక్స్‌డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications