
యుగీన్ : వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతోంది. మహిళల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ చేరి ఆశలు రేపిన బళ్లెం నాయిక అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. వరుసగా రెండో ఎడిషన్‌లోనూ పతకాన్ని అందుకోలేకపోయింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె జావెలిన్‌ను 61.12 మీటర్లు మాత్రమే విసిరి పతకాన్ని చేజార్చుకుంది.
ఓవరాల్‌గా ఆమె ఏడో స్థానంలో నిలిచింది. తన పర్సనల్ బెస్ట్ అయిన 63.82 మార్కును అందుకుంటే కనీసం కాంస్యపతకమైనా నెగ్గేది. ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీలీ బార్బర్ 66.91 మీటర్లు జావెలిన్‌ను విసిరి గోల్డ్ మెడల్ సాధించగా.. కారా వింగర్(అమెరికా) 64.05 మీటర్లు, హరుక కిటాగుచి(జాపాన్) 63.27 మీటర్ల దూరం విసిరి సిల్వర్, బ్రాంజ్ మెడల్ గెలిచారు.
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇండియాకు శుక్రవారం ట్రిపుల్ బొనాంజా లభించింది. ఒకే రోజు ముగ్గురు అథ్లెట్లు ఫైనల్‌కు చేరుకొని ఔరా అనిపించారు. గోల్డ్ తెస్తాడని ఆశిస్తున్న ఇండియా గోల్డెన్ స్టార్ నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్ మెన్స్ జావెలిన్ త్రోలో ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లారు. మరోవైపు ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో తుది రౌండ్‌కు అర్హత సాధించిన ఇండియా తొలి క్రీడాకారుడిగా ఎల్డోస్ పాల్ రికార్డు సృష్టించాడు. ఇండియా టైమ్ ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన మెన్స్ జావెలిన్ త్రో గ్రూప్-ఎ క్వాలిఫికేషన్‌లో బరిలో నిలిచిన నీరజ్ అంచనాలు అందుకుంటూ.. అద్భుత ఆటను కనబరిచాడు. తొలి ప్రయత్నంలోనే బల్లెంను 88.39 మీటర్ల దూరం విసిరాడు.
అతని కెరీర్‌లో ఇది మూడో బెస్ట్ త్రో కావడం విశేషం. దీంతో చోప్రా గ్రూప్-ఎలో తొలి, ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచాడు. మొదటి త్రో తోనే ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కు (83 మీ.) దాటడంతో నీరజ్ మరో రెండు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. గ్రూప్-బిలో పోటీ పడ్డ మరో ఇండియన్ రోహిత్ యాదవ్ 80.42 మీటర్లతో ఆరో ప్లేస్.. ఓవరాల్‌గా 11వ స్థానం సాధించాడు.
రోహిత్ తొలి ప్రయత్నంలోనే ఈ దూరాన్ని అందుకోగా.. రెండోసారి ఫౌల్ చేశాడు. మూడో త్రో లో కేవలం 77.32 మీ. కే పరిమితం అయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) 89.91 మీ.తో ఓవరాల్‌గా టాప్ ప్లేస్ సాధించాడు. ఆదివారం ఉదయం జరిగే ఫైనల్లో చోప్రాతో పాటు రోహిత్ పతక వేటలో నిలిచారు. చోప్రాకు ప్రధానంగా పీటర్స్‌తో పాటు జులియన్ వెబర్ (జర్మనీ)తో పోటీ ఎదురవనుంది. క్వాలిఫికేషన్‌లో వెబర్ 87.28 మీ. తో ఓవరాల్‌గా మూడో స్థానం సాధించాడు.