
యుగీన్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత బళ్లెం వీరుడు, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 88.39 మీటర్ల దూరం విసిరి గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ రెండో స్థానంతో ఫైనల్ చేరాడు. తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.39 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండు ప్రయత్నాల్లో ఫౌల్ చేశాడు.
ఇక మరో భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ సైతం ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్ బీలో పోటీపడ్డ అతను జావెలిన్‌ను 80.42 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ సాధించాడు. 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించగా అందులో ఇద్దరు భారతీయులు ఉండటం ఇదే తొలిసారి. ఇక నీరజ్ చోప్రా కంటే ముందు గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్సన్ ఉన్నాడు. అతను 89.91 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రాకు ప్రధాన పోటీ పీటర్సన్‌తోనే ఉండనుంది. ఈ ఏడాది ఇప్పటికే అతను మూడు సార్లు 90 మీటర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఫిన్‌లాండ్‌కు చెందిన ఒలివర్ హెలాండర్ కూడా నీరజ్ చోప్రాకు పోటీ ఇవ్వనున్నాడు.
గురువారం మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్‌లో అన్ను రాణి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల అన్ను రాణి జావెలిన్‌ను 59.60 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ సాధించింది. ఇక ఫైనల్ రౌండ్స్ ఆదివారం జరగనున్నాయి. ఈ టోర్నీలో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. ఈ ఘనత సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కుతాడు. 19 ఏళ్ల క్రితం (2003) అంజూ బాబీ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం గెలిచింది. ఆ తర్వాత మరే భారత అథ్లెట్ పతకం సాధించలేకపోయాడు. కెరీర్‌లో తొలి వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఆడుతున్న నీరజ్ చోప్రా భారత్ నిరీక్షణను తెరదించుతాడని అంతా భావిస్తున్నారు.