భారత హర్డిల్ క్వీన్, తెలుగు తేజం జ్యోతి యర్రాజీ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది. ఆమెపై సానుభూతి చూపుతూ నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. క్రికెట్ మత్తులో ఉన్న దేశం ఓ గొప్ప క్రీడాకారిణి విజయాన్ని గుర్తించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్రికెటర్లు విజయం సాధిస్తే కోట్ల రూపాయాల నజరానాను ప్రకటించే ప్రభుత్వం.. ఇతర క్రీడాకారులను పట్టించుకోవడం లేదని, అభిమానులు కూడా ఇతర క్రీడల వైపు ఆసక్తి చూపించడం లేదని మండిపడుతున్నారు. అభిమానులు షేర్ చేస్తున్న ఈ వీడియోలో జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం గెలవగా.. స్టేడియంలో ఒక్క ప్రేక్షకుడు కూడా లేడు. పూర్తిగా ఖాళీగా ఉన్న స్టేడియంలో ముగ్గురు విజేతలు మాత్రమే ఉన్నారు.

అయితే ఈ వీడియోను చూసి నెటిజన్లు ఇటీవల జరిగిందని పొరబడుతున్నారు. కానీ ఈ ఏడాది మేలో దక్షిణ కొరియాలోని గుమీ వేదికగా జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు చెందిన వీడియో ఇది. ఈ టోర్నీలో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడిన జ్యోతి యర్రాజీ 12.96 సెకన్లతో గోల్డ్ మెడల్ గెలిచి, ఛాంపియన్‌షిప్ రికార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది.
మే 29న జరిగిన ఈ ఫైనల్ రేస్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో ఈ స్టేడియం పూర్తిగా ఖాళీ అయింది. ఒక్క ప్రేక్షకుడు లేకున్నా.. జ్యోతి ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా అద్భుతంగా పోరాడింది. జపాన్‌కు చెందిన యుమి తనాకా(13.04 సెకన్లు), చైనాకు చెందిన యానీ వు (13.12 సెకన్లు) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
విశాఖపట్టణానికి చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ నిరుపేద కుటుంబం నుంచి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. జ్యోతి యర్రాజి తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. తల్లి కుమారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ సహకారంతో జ్యోతి యర్రాజీ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఆమెకు సంబంధించిన ట్రైనింగ్, న్యూట్రిషన్ రిలయన్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది. ఎన్ని విజయాలు సాధించినా.. తనకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని గతంలో మైఖేల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి యర్రాజీ చెప్పుకొచ్చింది.