Pooja Singh: 14 ఏళ్ల రికార్డ్ ఖేల్ ఖతం.. ఎవరీ భారత హైజంప్ నయా క్వీన్!
క్రీడాకారుల ప్రయాణంలో ఓటములు సహజం. కానీ, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తగిలే ఒక్క గాయం... భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి కఠిన పరిస్థితినే ఎదుర్కొని, ఏడాది తిరగకుండానే ఊహించని రీతిలో రీఎంట్రీ ఇచ్చింది భారత అథ్లెట్ పూజా సింగ్!
14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న నేషనల్ రికార్డ్‌ను గాల్లోకి ఎగిరి బద్దలు కొడుతూ.. భారత హైజంప్ సామ్రాజ్యంపై తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. క్రికెట్ తప్పా ఏ క్రీడను పెద్దగా పట్టించుకోని ఈ దేశంలో పూజా సింగ్ హై జంప్ నయా క్వీన్‌గా అవతరించింది. గాయం నుంచి గర్జన వరకు సాగిన ఈ టీనేజ్ సంచలనం వెనుక ఉన్న కన్నీళ్లు, కష్టం, కంబ్యాక్ స్టోరీ ఇది!
మేస్త్రీ బిడ్డ..
హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా, బోస్తి గ్రామానికి చెందిన పూజా సింగ్‌ది అత్యంత నిరుపే కుటుంబం. ఆమె తండ్రి హన్స్‌రాజ్ ఓ మేస్త్రీ. తల్లి కిరణ్ హౌస్ వైఫ్. రెక్కాడితే డొక్కాడని కుటుంబమైనా ఆమె తండ్రి ఎంతో ప్రోత్సహించాడు. కెరీర్ ఆరంభంలో పూజా సింగ్, గడ్డి, వైకోలు, థర్మకోల్ షీట్లతోనే హైజంప్ ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది.

2023 ఆసియా యు-20 ఛాంపియన్‌షిప్‌తో..
2023 ఆసియా యు-20 ఛాంపియన్‌షిప్‌లో 1.82 మీటర్ల ఎత్తు దూకి సిల్వర్ మెడల్‌తో మెరిసిన పూజ సింగ్ తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన ఆమె.. 2024 పెరూ ప్రపంచ యు-20 ఛాంపియన్‌షిప్‌లో 1.83 మీటర్ల జాతీయ యు-20 రికార్డును అందుకుంది. అదే ఏడాది భువనేశ్వర్‌లో తన రికార్డును 1.85 మీటర్లకు మెరుగుపర్చుకుంది.
అంతలోనే గాయం..
2025లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 1.89 మీటర్లతో పూజా సింగ్ గోల్డ్ మెడల్ గెలిచి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విభాగంలో బాబీ అలోసియస్ (2000) తర్వాత గోల్డ్ మెడల్ నెగ్గిన రెండో భారత మహిళగా చరిత్ర సృష్టించింది. అయితే, అదే ఏడాది జూన్‌లో మోకాలి గాయంతో ఆటకు దూరమైంది.
ఖేలో ఇండియా గేమ్స్‌లో రీఎంట్రీ..
ఏడాది తర్వాత 2026లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌తో పూజా రీఎంట్రీ ఇచ్చింది.
1.77 మీటర్లు దూకి స్వర్ణం నెగ్గింది . ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో 1.87 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించడమే కాకుండా.. న్యూఢిల్లీలో 1.90 మీటర్ల మార్కును అందుకుంది.
అనంతరం హాంగ్‌కాంగ్ ఆసియా యు-20 ఛాంపియన్‌షిప్‌లో పూజ 1.93 మీటర్ల ఎత్తును దూకి నేషనల్ రికార్డ్ సాధించింది. 2012లో సహానా కుమారి నెలకొల్పిన 1.92 మీటర్ల జాతీయ రికార్డును పూజా అధిగమించింది. ఈ చారిత్రక ఘట్టాన్ని సహానా ప్రత్యక్షంగా చూసి పూజను ప్రశంసించడం గమనార్హం.
ఆస్ట్రేలియా కోచ్ ఫిదా..
ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ హైజంప్ కోచ్ మాట్ హార్స్‌నెల్ సైతం పూజ ప్రదర్శనకు ఫిదా అయ్యారు. ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ యు-20 ఛాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకు అర్హత సాధించిన పూజా సింగ్... భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త సంచలనాలను సృష్టించేందుకు సిద్దమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


