పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్‌క్వాలిఫై అవ్వడంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. ఇందులో వినేష్ ఫోగట్ తప్పు ఏం లేదన్నారు. ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ)తో అన్ని విధాల పోరాడుతామని తెలిపారు.
సంచలన ప్రదర్శనతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కాగా.. దేశంలో రాజకీయ రగడకు దారి తీసింది. పాలక పక్షం, ప్రతిపక్షం మధ్య యుద్దం నడుస్తోంది. పార్లమెంట్ పూర్తి స్థంభించింది.

ఈ క్రమంలో వినేష్ ఫోగట్ డిస్‌క్వాలిఫికేషన్‌పై డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్.. వన్ ఇండియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 'ఫైనల్ చేరి స్వర్ణ పతాక ఆశలు రేకెత్తించిన వినేష్ ఫోగట్‌పై వేటు పడటం దురదృష్టకరం. అదనపు బరువు కారణంగా భారత్ ఒక పతకం కోల్పోవడం బాధాకరం. ఈ వ్యవహారంలో వినేష్ తప్పు లేదు.
రెండు రోజుల పాటు ఆమె బరువు స్థిరంగానే ఉంది. రాత్రికి రాత్రి ఒక్కసారిగా ఆమె బరువు పెరిగిపోయింది. ఇందుకు కారణం ఏంటనేది ఆమె కోచ్, న్యూట్రిషనిస్ట్, సహాయక సిబ్బందే వివరణ ఇవ్వాలి. సపోర్ట్ స్టాఫ్‌దే తప్పున్నట్లు అర్థం అవుతోంది. వినేష్ ఫోగట్ సపోర్ట్ స్టాఫ్‌ను ప్రభుత్వం కానీ, డబ్ల్యూఎఫ్‌ఐ కానీ నియమించలేదు. ఆమెనే స్వయంగా ఎంచుకుంది.
ప్రస్తుతం వినేష్ ఫోగట్ బాగానే ఉంది. డీహైడ్రేషన్ నుంచి కోలుకుంది. నేను ఇంకా వినేష్ ఫోగట్‌తో మాట్లాడలేదు. ప్రస్తుతం ఆమె మాట్లాడేందుకు సిద్దంగా లేదు. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. డబ్ల్యూఎఫ్‌ఐ పాత్ర ఏ మాత్రం లేదు. భారత్‌లో ఆటల కంటే రాజకీయ ఒత్తిళ్లే ఎక్కువయ్యాయి.
వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై డబ్ల్యూఎఫ్‌ఐ.. యూడబ్ల్యూడబ్ల్యూతో పాటు ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి లేఖ రాసింది. కానీ వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. మేం త్వరలోనే యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడిని కలుస్తాం. యూడబ్ల్యూడబ్ల్యూ, ఐఓసీ, అర్గనైజింగ్ కమిటీ మధ్య ఈ వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి. సానుకూల ఫలితం రావడం కష్టమే. కానీ మేం ప్రయత్నిస్తాం. మ్యాచ్ సందర్భంగా గాయపడి ఉంటే ఆమెకు సిల్వర్ దక్కేది. డబ్ల్యూఎఫ్‌ఐ నుంచి మా ప్రయత్నం మేం చేస్తున్నాం.'అని సంజయ్ సింగ్ చెప్పుకొచ్చాడు.