
హైదరాబాద్: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పెద్దగా విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో సత్తా చాటిందే లేదు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి భారత్ పోటీపడింది. అప్పటి నుంచి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ వరకు మెగా ఈవెంట్‌లో భారత్ సాధించింది ఒకే ఒక్క మెడల్. అది కూడా మన తెలుగు తేజం కరణం మళ్లీశ్వరీ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచింది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ సాధించిన తొలి, ఏకైక మెడల్ ఇదే.
ఆ తర్వాత దేశంలో వెయిట్ లిఫ్టింగ్‌కు ఆదరణ పెరిగినా ఒలింపిక్ మెడల్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది. కానీ, ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ మెడల్స్ కరువు తీరే సమయం ఆసన్నమైంది. 20 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మీరాబాయి చాను ఫేవరేట్‌గా టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగుతోంది. భారత్ నుంచి మీరా తప్ప మరే లిఫ్టర్ టోక్యోకు అర్హత సాధించలేదు. మహిళల 49 కేజీ కేటగిరీలో చాను ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గోల్డ్ మెడల్ రేసులో చైనాకు చెందిన హౌ జిహోయ్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ చాను పతకం తేవడం ఖాయమని వెయిట్ లిఫ్టింగ్ విశ్లేషకులు అంటున్నారు.
మాజీ వరల్డ్ నంబర్ వన్ చాను ఇటీవల ప్రదర్శన ఇందుకు కారణం. ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన చాను.. క్లీన్ జర్క్‌లో 119 కేజీల బరువెత్తి వరల్డ్ రికార్డు సృష్టించింది. స్కాచ్‌లో 86 కేజీల బరువు మోసింది. అంతకు ముందు 2018 కాన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తనపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
నిజానికి, చానుకు ఇది రెండో ఒలింపిక్స్. రియో ఒలింపిక్స్‌లో మూడు ప్రయత్నాల్లో కనీస బరువు కూడా ఎత్తలేకపోయింది. ఆ ఘోర అవమానం తర్వాత.. చాను తన టెక్నిక్‌లోని లోపాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా స్నాచ్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను సరిచేసుకుంది. వెంటనే 2017లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టింది. ఆ పెర్ఫామెన్స్ అనంతరం అమెరికా వెళ్లి 45 రోజుల ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంది. దీంతో చానూ ఒలింపిక్ మెడల్ తెస్తుందని వెయిట్ లిఫ్టింగ్ వర్గాలతో పాటు యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తోంది.