న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌కు ముందు భారత రెజ్లింగ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. గోల్డ్ మెడల్ ఫేవరెట్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(53 కేజీలు) మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న అంతిమ్ ఫంగల్‌కు మార్గం సుగుమమైంది. ఈ నెల 13న గాయపడిన వినేశ్ ఫొగాట్.. ముంబైలో గురువారం సర్జరీ చేయించుకోనున్నట్లు మంగళవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది.
వినేశ్ ఫొగాట్ ట్రయల్స్‌తో సంబంధం లేకుండా ఆసియా గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఆమె 2018 క్రీడల్లో స్వర్ణం గెలిచింది. 'ఓ బాధకరమైన వార్తను అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ఆగస్టు 13న ప్రాక్టీస్ సందర్భంగా నా ఎడమ మోకాలికి గాయమైంది. కోలుకోవాలంటే శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించారు.

ఆగస్టు 17న శస్త్రచికిత్స జరుగుతుంది. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ నిలబెట్టుకోవాలన్నది నా కల. కానీ దురదృష్టవశాత్తు నేను ఆ క్రీడలకు దూరమవుతున్నా.'అని వినేశ్ ఫొగాట్ తెలిపింది. 2018 ఆసియా గేమ్స్‌లో వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ నెగ్గింది. అయితే, సర్జరీ కారణంగా ఈ నెల 25, 26న జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు కూడా దూరం కానుంది.
దాంతో ఒలింపిక్ బెర్త్‌లు లభించే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ ఆమె పాల్గొనే అవకాశం లేదు. లైంగిక ఆరోపణల కేసులో డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వినేశ్‌తో పాటు బజ్‌రంగ్ పునియాను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
వాళ్ల ఎంపికను వ్యతిరేకిస్తూ అంతిమ్ పంగాల్ (53కేజీ), సుజిత్ కల్కల్ (65కేజీ) హైకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. అయితే ట్రయల్స్ విజేతలైన వీరు ఆసియా క్రీడలకు రిజర్వ్‌లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు వినేశ్ ఫొగాట్ వైదొలగడంతో అంతిమ్‌కు మార్గం సుగమమైంది. ఆమె ఇక ఆసియా క్రీడల్లో మహిళల 53 కిలోల కేటగిరిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.