పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్.. చివరి నిమిషంలో 100 గ్రాములు అధిక బరువు ఉందనే కారణంతో డిస్‌క్వాలిఫై అయ్యింది. దాంతో రెజ్లింగ్ నియమాల ప్రకారం ఆమెకు ఏ పతకం రాలేదు.
ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు ముగియగా.. ఆగస్ట్ 13న తుది తీర్పు వెలువడనుంది. ఒకే రోజు మూడు మ్యాచ్‌లు ఉండటంతో శక్తి కోసం అధికంగా తినాల్సి వచ్చిందని, దాంతో బరువు పెరిగిందని వినేష్ ఫోగట్ తరఫున లాయర్లు వాదించారు.

వినేష్ ఫోగట్ అధిక బరువు కూడా 100 గ్రాములేనని, ఇది ప్రత్యర్థిపై ఏ మాత్రం ప్రభావం చూపదన్నారు. వినేష్ ఫోగట్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవడంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోది.
ముఖ్యంగా రెజ్లర్ల బరువు కొలిచే నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులను పూర్తి స్థాయిలో కాకుండా అథ్లెట్ల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని స్వల్ప మార్పులు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెజ్లర్లు, ఇతర అథ్లెట్లు వినేష్ ఫోగట్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఆమెకు రజత పతకం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.