పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇవ్వడం కుదురదని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ నెనాద్ లాలోవిచ్ అన్నారు. వినేష్ ఫోగట్ ఒక్కరి కోసం రూల్స్‌ను మార్చలేమని స్పష్టం చేశారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరి రజత పతకం ఖాయం చేసిన వినేష్ ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందనే కారణంతో డిస్‌క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వినేష్ ఫోగట్ అనర్హత వేటు వెనుక భారీ కుట్ర ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫైనల్ చేరిన వినేష్ ఫోగట్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు ముగియగా.. ఆగస్ట్ 13న తుది తీర్పు వెలువడనుంది.

ఈ క్రమంలో ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు నెనాద్ లాలోవిచ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'వినేష్ ఫోగట్‌కు గతేడాదిన్నరగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఆమెపై నేను జాలిపడగలను. అంతేకానీ ఆమెకు ఎలాంటి సాయం చేయలేను. ఎందుకంటే నిబంధనలు అనేవి అందరికి సమానమే. ఒకరి కోసం వాటిని మనం మార్చలేము.
క్రీడలు అనేవి నిబంధనల ప్రకారమే జరుగుతాయి. యూరప్‌కు చెందిన నేను భారత్‌కు వచ్చినప్పుడు అక్కడి నియమాలనే పాటించాలి. అలా కాకుండా యూరప్ రూల్స్‌ను భారత్‌లో పాటిస్తే సమస్యలు ఏర్పడుతాయి. క్రీడల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అందరికీ ఒకే రూల్స్ ఉంటాయి. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం గాయపడిన ఆటగాళ్లకు పతకం ఇవ్వవచ్చు. కానీ వినేష్ ఫోగట్ గాయపడలేదు.
ఆమెకు గాయమైనట్లు చెబితే వైద్య బృందంతో చెక్ చేయించేవాళ్లం. ఈ ఒలింపిక్స్‌లో ఓ ఆటగాడు అధిక బరువు కారణంగా.. బరువు పరీక్షకు హాజరు కాలేదు. దాంతో అతనిపై వేటు పడింది. కాబట్టి వినేష్ ఫోగట్ ఒక్కరి కోసం రూల్స్‌ను మార్చలేము. మొదటి రోజు మాత్రమే బరువును కొలిచి.. రెండో రోజు ఆటకు అనుమతించాలని చెబుతున్నారు. మొదటి రోజు తర్వాత 5 కిలోల బరువు పెరిగి రెండో రోజు ఆడితే.. ఆటలో సమతుల్యత ఉండదు.
రెజ్లింగ్ అనేది బరువు పోటీ. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇవ్వడం కుదురదు. ఈ వ్యవహారంపై ట్రిబ్యూనల్‌లో సవాల్ చేసాం. వినేష్ ఫోగట్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే మాత్రం దానిని అమలు చేస్తాం'అని నెనాద్ లాలోవిచ్ చెప్పుకొచ్చారు.