
పుణే: అల్టిమేట్ ఖో ఖో లీగ్ ఆరంభ సీజన్‌లో ఒడిశా జాగర్‌నట్స్ జోరు కొనసాగుతోంది. ఈ జట్టు లీగ్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ వారియర్స్‌తో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 పాయింట్ల తేడాతో ఒడిశా జాగర్‌నట్స్ విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఈ టీమ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అటాకర్ నితేశ్ జాధవ్ 16 పాయింట్లతో సత్తా చాటగా.. డిఫెండర్ దిపేశ్ 2.53 నిమిషాల పాటు తప్పించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మొదటి టర్న్‌లోనే డిఫెన్స్‌లో రాణించి లీడ్ సాధించిన ఒడిశా.. రెండో టర్న్‌లోనూ అదే జోరు కొనసాగించింది. రాజస్థాన్ వారియర్స్ నుంచి ప్రతిఘటన ఎదురైన లీడ్ తగ్గకుండా జాగ్రత్త పడింది. దాంతో ఫస్టాఫ్ ముగిసేసరికి ఒడిశా 27-21తో ఆధిక్యంలో నిలచింది.

మూడో టర్న్‌లో నాలుగు నిమిషాలతో ఆరు బోనస్ పాయింట్లు సాధించిన ఆ జట్టు.. ప్రత్యర్థికి కేవలం 16 పాయింట్లు మాత్రమే ఇచ్చింది. అదే జోరును చివరకు కొనసాగించి విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఇక ఈ విజయంతో ఒడిశా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
పోరాడి ఓడిన తెలుగు యోధాస్..
వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు యోధాస్‌కు గుజరాత్ జెయింట్స్ కళ్లెం వేసింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 51-48తో తెలుగు యోధాస్‌ను ఓడించింది. మ్యాచ్ ఆసాంతం అద్భుతంగా పోరాడిన తెలుగు యోధాస్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. చివర్లో పోరాడినా మూడు పాయింట్లతో ఓటమిపాలైంది.
ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇరు జట్లు 27-27తో సమంగా నిలిచాయి. టర్న్ 3లో తెలుగు యోధాస్ అనవసర తప్పిదాలతో గుజరాత్‌కు పాయింట్లు ఇచ్చింది. ఆ తర్వాత టర్న్ 4లో పోరాడినా ఫలితం లేకపోయింది. గుజరాత్ విజయంలో అభినందన్ పాటిల్, రంజన్ శెట్టి కీలక పాత్ర పోషించారు. తెలుగు తేజం శివారెడ్డి 3.18 నిమిషాలు తప్పించి గుజరాత్ జెయింట్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించిన ఆ జట్టు అద్భుత విజయాన్నందుకుంది.