
హైదరాబాద్ : అల్టిమేట్ ఖో-ఖో ఆరంభ సీజన్‌లో దూకుడు కనబరుస్తున్న తెలుగు యోధాస్‌కు తొలి ఓటమి ఎదురైంది. లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి జోష్‌లో ఉన్న తెలుగు యోధాస్ స్పీడ్‌కు చెన్నై క్విక్ గన్స్ బ్రేక్ వేసింది. పుణె వేదికగా బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో యోధాస్ 46-52తో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. లీగ్‌లో చెన్నైకిదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి అర్ధభాగాన్ని పేల వంగా ఆరంభించిన యోధాస్, రెండో అర్ధభాగంలో పుంజుకున్నా విజయ తీరాలకు చేరలేకపోయింది.
ఇక, మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 66-48తో ముంబై ఖిలాడీస్‌పై నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, యోధాస్ రెండో స్థానంలో ఉంది.
మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆదర్శ్ మోహిత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో తెలుగు యోధాస్ 68-47 స్కోరు తేడాతో రాజస్థాన్ వారియర్స్‌ను చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి 30-20తో ఆధిక్యంలో ఉన్న యోధాస్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదేజోరుతో విజృంభించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఆదర్శ్‌తో పాటు ప్రసాద్ తెలుగు జట్టులో రాణించాడు. తెలుగు యోధాస్ సాధించిన 68 పాయింట్లలో 22 ట్యాకిల్,16 స్కై డైవ్స్, 6 పోల్ డైవ్స్, 6 ఇతర డైవ్స్, 12 టచ్ పాయింట్స్ ఉన్నాయి.
నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ వారియర్స్‌తో ఒడిశా జాగర్‌నట్స్, చెన్నై క్విక్ గన్స్‌తో ముంబై ఖిలాడీస్ తలపడుతాయి. రాత్రి 7.30 నుంచి ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. సోనీ టెన్ టీవీలో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ టెన్ 4లో తెలుగు కామెంట్రీతో మ్యాచ్‌లు ప్రసారం అవుతున్నాయి. వరుసగా రెండు విజయాలతో 6 పాయింట్లు సాధించిన తెలుగు యోధాస్ మూడో మ్యాచ్‌లో ఓడటంతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. 9 పాయింట్లతో గుజరాత్ జెయింట్స్ టాప్ ప్లేస్ చేరింది.