
న్యూఢిల్లీ: జపాన్ వేదికగా ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్ క్రీడను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్ డియాజ్ సంతోషంలో మునిగిపోయింది. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో ప్రాక్టీస్ మొదలెట్టింది. నీటి అలలపై రయ్‌మని దూసుకెళ్లడంలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. కానీ నీళ్లే ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాలు వదిలింది.
ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే కేథరిన్ డియాజ్ దురదృష్టవశాత్తూ పిడుగుపాటుకు గురై తుదిశ్వాస విడిచింది. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్ అయిన కేథరిన్ డియాజ్.. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన ఆమె.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. ''మా దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప ఫైటర్. దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది'' అని ఆ దేశ సర్ఫ్ సమాఖ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.