
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. ఆదివారం జరిగిన పురుషుల హై జంప్ టీ-47 కేటగిరీలో భారత ప్లేయర్ నిషధ్ కుమార్ రజత పతకం సాధించాడు. అమెరికా అథ్లెట్ డల్లాస్ వైస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచిన అతను సిల్వర్ మెడల్‌ను షేర్ చేసుకున్నాడు. ఫైనల్ రౌండ్‌లో 1.94 మీటర్లను సునాయసంగా అధిగమించిన నిషద్ కుమార్.. 1.98 మీటర్లకు కొంత కష్టపడ్డాడు.
రెండో ప్రయత్నంలో ఎట్టకేలకు అధిగమించి టాప్‌కు దూసుకెళ్లాడు. కానీ అమెరికా అథ్లెట్లు డల్లాస్ వైస్, రొడెరిక్ టౌన్‌సెండ్ అతనికి గట్టి పోటీనిచ్చారు. 2.06 మీటర్లను క్లియర్ చేసి నిషద్ పతకాన్ని ఖాయం చేసుకోగా..డల్లాస్ వైస్ కూడా అంతే ఎత్తును క్లియర్ చేసి సమంగా నిలిచాడు. ఇక 2.15 మీటర్లతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రొడెరిక్ టౌన్‌సెండ్ స్వర్ణపతకం సాధించాడు.
రజత పతకం సాధించిన నిషద్‌ను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ట్విటర్ వేదికగా అతని విజయాన్ని కొనియాడారు. 'టోక్యో నుంచి చాలా సంతోషకరమైన వార్త. పురుషుల హైజంప్‌లో నిషద్ కుమార్ సిల్వర్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతనో అద్భుతమైన అథ్లెట్. అతనికి అభినందనలు'అని మోదీ ట్వీట్ చేశారు.
ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత హై జంపర్ రాంపాల్ చాహర్ పోడియం ఎక్కలేకపోయాడు. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 1.96 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన రాంపాల్.. 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు.
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషద్ కుమార్‌కు.. పుట్టుకతోనే కుడి చేతి సరిగ్గా లేదు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యూకేషన్ విద్యార్థి అయిన 22 ఏళ్ల నిషద్ కుమార్.. 2009లో పారా అథ్లెట్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి 10 ఏళ్ల వయసు. దుబాయ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 2 మీటర్ల ఎత్తు దూకిన నిషద్.. ఈ అత్యుత్తమ ప్రదర్శనతోనే టోక్యో బెర్త్ సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషద్ ఆసియా రికార్డు నమోదు చేశాడు. ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో 2.06 మీటర్లు ఎత్తును దూకి స్వర్ణ పతకం సాధించాడు.
నిషధ్ కుమార్ విజయంతో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఆదివారం ఉదయమే టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా దేవీ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ యింగ్ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా దేవీ ఓడింది.