
టోక్యో: విజయం కోసం అడ్డదారులు తొక్కే ఆటగాళ్లను చూశాం! ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థులను గాయపరిచే ప్లేయర్ల గురించి విన్నాం! అనవసరంగా నోరుపారేసుకొని ప్రత్యర్థి ఆటగాడి ఏకాగ్రతను దెబ్బతీసేవారి గురించి చదివాం! కానీ గాయంతో పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థి ఆటగాడి పోరాటాన్ని గౌరవిస్తూ.. అతనితో మెడల్ పంచుకున్న ఆటగాడిని ఇప్పటి వరకు ఎక్కడ చూసుండం! కానీ టోక్యో ఒలింపిక్స్ ఆ అరుదైన సన్నివేశానికి వేదికైంది.
ఎక్కడ విశ్వక్రీడలు జరిగినా... కొద్దో గొప్పో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అలానే కొన్ని స్పూర్తిదాయకమైన కథలు వినిపిస్తుంటాయి. ఈ సారి కూడా పురుషుల హైజంప్ ఈవెంట్‌లో అత్యంత అరుదైన పతక ప్రదర్శన నమోదైంది. కనీవినీ ఎరుగని రీతిలో ఒక ఈవెంట్లో ఇద్దరు విజేతలొచ్చారు. వీరికి చెరో బంగారు పతకం అందజేశారు. దీంతో పురుషుల హైజంప్... పసిడి పంచిన ఈవెంట్‌గా రికార్డుల్లోకెక్కింది.
అయితే ఖాతర్‌కు చెందిన ముతాజ్ బర్షిమ్ గొప్ప మనసు కారణంగా ఇది సాధ్యమైంది. అతను యావత్ ప్రపంచం మెచ్చుకునే పనిచేశాడు. క్రీడా స్పూర్తి అంటే ఇది అని ప్రతీ క్రీడాభిమాని కాలర్ ఎగిరేసేలా చేశాడు. పురుషుల హైజంప్ ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ కోసం ముతాజ్ ఐసా బర్షిమ్, ఇటలీకి చెందిన గియాన్‌మార్కో తంబేరీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ 2.37 మీటర్లే దూకడంతో నిర్వాహకులు ఇద్దరికి అదనంగా మరో మూడు అవకాశాలిచ్చారు. కానీ ఈ ఇద్దరూ ఈ 2.37 మీటర్ల మార్క్‌ను అందుకోలేకపోయారు. దాంతో అధికారులు ఫైనల్‌గా ఇద్దరికి మరో అవకాశం ఇచ్చారు. కానీ చివరి ప్రయత్నంలో తాంబేరీ కాలికి తీవ్రంగా గాయమవడంతో అతను పాల్గొనని చెప్పాడు. దాంతో బర్షిమ్‌కు పోటీలేకుండానే పోయింది. సులువుగా అతను బంగారు పతకం గెలిచేవాడు.
కానీ తన ప్రత్యర్థి తంబేరీ పోరాటాన్ని గుర్తించిన బర్షిమ్ నిర్వాహకుల వద్దకు వెళ్లి తాను కూడా చివరి అటెంప్ట్‌లో పాల్గొనకుంటే మెడల్‌ను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అని అడిగాడు. దాంతో అధికారులు నిబంధనలను పరిశీలించి ఆ అవకాశం ఉందని చెప్పడంతో బర్షిమ్ ఏ మాత్రం ఆలోచించకుండా చివరి అటెంప్ట్‌లో పాల్గొనకుండా విరమించుకున్నాడు. దాంతో ఈ ఇద్దరూ స్వర్ణ పతకాలు అందుకున్నారు.
అయితే ఈ క్షణాన్ని ఈ ఇద్దరు ఆస్వాదించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. బర్షీమ్‌ను కౌగిలించుకున్న తంబేరీ గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. బర్షీమ్ చేసిన పని అందరి మనస్సులను హత్తుకుంది. ప్రేమకు సరిహద్దులు, మతాలు, రంగులు అనవసరం లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.