
టోక్యో: పురుషుల ట్రాక్ ఈవెంట్‌లో.. నార్వే అథ్లెట్ కార్స్‌టెన్ వార్‌హోమ్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం జరిగిన 400 మీటర్స్ హర్డిల్స్ ఈవెంట్‌లో అసాధారణమైన కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. రేసును కేవలం 45.94 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త చరిత్రను లిఖించాడు. ఫలితంగా తన రికార్డును తానే అధిగమించాడు.
ఈ ఏడాది జూలైలో ఓస్లో వేదికగా జరిగిన డైమండ్ లీగ్ పోటీల్లో వార్ హోమ్ 46.70 సెకన్ల టైమింగ్‌తో 29 ఏళ్ల రికార్డును అధిగమించాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో చాంపియన్ కెవిన్ యంగ్ పేరిట ఉన్న 46.78 సెకన్లే రికార్డుగా ఉండేది. తాజా ఒలింపిక్స్‌లో వార్ హోమ్ ది బెస్ట్ పెర్ఫామెన్స్‌తో గోల్డ్ మెడల్ కైవసం చేసుకొని చరిత్రకెక్కాడు.
వార్‌హోమ్ తర్వాత అమెరికాకు చెందిన బెంజిమన్ రాయ్ 46.17 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోగా.. బ్రెజిల్‌కు చెందిన సాంటోస్ అల్సిన్ 46.72 సెకన్లతో కాంస్యం అందుకున్నాడు. మూడుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వార్‌హోమ్.. తాజా పోటీల్లోను ఆరంభం నుంచి ముందంజలో ఉన్నాడు. ఫినిషింగ్ లైన్‌ను అదే వేగంతో పూర్తి చేశాడు. 2019లో జరిగిన పాన్ అమెరికా క్రీడల్లోనూ వార్‌హోమ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముగ్గురు మెడలిస్ట్‌లు తమ చివరి ఒలింపిక్స్‌లో కంటే మెరుగైన ప్రదర్శన చేశారు.
ఈ వరల్డ్ రికార్డుతో పాటు ఒలింపిక్స్‌లో పసిడి గెలవడంపై వార్ హోమ్ సంతోషం వ్యక్తం చేశాడు. తన సంతోషాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదన్నాడు. ఈ నయా రికార్డును నెలకొల్పడాన్ని నమ్మలేకపోతున్నానన్నాడు. ఈ మెడల్ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డానని, రేస్‌కు వెళ్లే ముందు నా కష్టాలన్నీ గుర్తు చేసుకొన్నానని తెలిపాడు. ఇదే సువర్ణవకాశాంగా భావించి తన శక్తిని మొత్తం దారపోసానన్నాడు.