
టోక్యో: మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేవనుండగా ఒలింపిక్ క్రీడా గ్రామంలో కరోనా కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఒలింపిక్ విలేజ్‌లో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. దీంతో విశ్వక్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ఒలింపిక్స్ నిర్వాహకులు అలాగే ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఇద్దరు సౌతాఫ్రికా ఫుట్‌బాల్ టీమ్ ఆటగాళ్లు తబిసో మోనియాని, కామొహెలో మాహ్‌లాస్తి వైరస్ బారిన పడగా తాజాగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఒండ్రెజ్ పెరుసిక్‌కు పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని ఆదేశ అథ్లెట్ల టీమ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతో మొత్తం ముగ్గురు ఒలింపిక్స్ క్రీడాకారులు వైరస్‌బారిన పడ్డారని తెలిసింది. ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 58 మంది క్రీడా సంబంధిత వ్యక్తులకు కొవిడ్-19 సోకిందని నిర్వాహకులు ప్రకటించారు. కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించినా అతను వైరస్ బారిన పడ్డాడని ఆ దేశ ఒలింపిక్స్ కమిటి వివరించింది. ప్రస్తుతం అతడికి లక్షణాలేవీ లేవని, దాంతో ఓ హోటల్‌లో ఐసోలేషన్‌కు తరలించారని పేర్కొంది. ఇక జూలై 26న పెరుసిక్ జ్ఞ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉందని, ఇప్పుడు దాన్ని వాయిదా వేయాలని నిర్వాహకులను కోరనున్నట్లు చెక్ రిపబ్లిక్ ఒలింపిక్స్ కమిటి తెలిపింది.
ఆదివారం ఒక్కరోజే 10 కేసులు వెలుగు చూశాయి. ఇందులో దక్షిణాఫ్రికాకు చెందిన వారు నలుగురు కాగా... నిర్వహణా ఏర్పాట్ల బృందంలోని మరో ఆరుగురున్నారు. గేమ్స్ విలేజ్‌లో భారత బృందం ఉన్న టవర్ 15లోనే దక్షిణాఫ్రికా టీమ్ ఉంటోంది.