
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత పురుష బాక్సర్ల ప్రస్థానం ముగిసింది. సోమవారం మిడిల్ వెయిన్(69-75 కేజీ) విభాగం ఫస్ట్ రౌండ్‌లోనే భారత బాక్సర్ సుశీల్ కుమార్ నిష్క్రమించాడు. చైనా బాక్సర్ ఎర్బీక్ తుహెటా చేతిలో చిత్తయ్యాడు. మూడు రౌండ్లలో డ్రాగన్ కంట్రీ బాక్సర్ చేతిలో ఆశిష్ తన్నులు తిన్నాడు. కనీస పోటీ కూడా ఇవ్వకుండా 0-5తో ఘోరపరాజయం చెందాడు. ఫస్ట్ రౌండ్ నుంచే ఆధిపత్యం చెలాయించిన చైనా బాక్సర్.. ఆశిష్‌పై పంచ్‌ల వర్షం కురిపించాడు. దాంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఆశిష్ ఓటమికి తలవొంచాడు. అతని ఓటమితో టోక్యోలో భారత పురుష బాక్సర్ల ప్రస్థానం ముగిసింది.
ఆదివారం పురుషుల 63 కేజీలవిభాగంలో మరో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్‌కు చుక్కెదురైంది. తొలి పోరులోనే అతను ఓటమిపాలై నిష్క్రమించాడు. బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మెక్‌కార్మాక్ 4-1తో మనీశ్‌ను ఓడించాడు. శనివారం జరిగిన పురుషుల వెల్టర్ వేయిట్ (69 కేజీల) విభాగంలో భారత బాక్సర్ వికాస్ క్రిషన్ ఓటమిపాలయ్యాడు. జపాన్ బాక్సర్ ఒకాజవా చేతిలో 5-0తో చిత్తయ్యాడు. ఈ పోరులో తీవ్రంగా గాయపడ్డ వికాస్ క్రిషన్.. చివరి వరకు పోరాడాడు. అతని ముక్కుపై ఒకాజవా బలమైన పంచ్‌లు ఇవ్వడంతో రక్తస్రావమైంది.
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఒక్కతే టోర్నీలో ముందుడగు వేసింది. రెండో ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న భారత బాక్సింగ్ దిగ్గజం ఆదివారం జరిగిన 51 కేజీల విభాగం తొలి రౌండ్‌లో 4-1 తేడాతో మిగులినా హెర్నాండెజ్ (డొమినికన్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్ ముందు 23 ఏళ్ల మిగులినా నిలవలేకపోయింది. తర్వాతి పోరులో కొలంబియాకు చెందిన మూడో సీడ్ ఇన్‌గ్రిట్ వలెన్సియాతో తలపడుతుంది.