Tokyo Olympics: కౌంట్‌డౌన్ స్టార్ట్.. మరో 50 రోజుల్లో సమ్మర్ గేమ్స్! సజావుగా జరిగేనా?

హైదరాబాద్: అతిపెద్దా క్రీడా ఈవెంట్ అయిన ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మరో 50 రోజుల్లో ఈ సమ్మర్ గేమ్స్ షురూ కానున్నాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ మెగా ఈవెంట్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. గతేడాదే జరగాల్సిన ఈ క్రీడల సంరంభం.. మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది.
ఇప్పుడు అదే పరిస్థితి ఉండటంతో గందరగోళం నెలకొంది. ఇక కరోనా మహమ్మారి భయపెడుతున్నా ఒలింపిక్స్‌ను ఈ ఏడాది కచ్చితంగా నిర్వహించి తీరుతామని ఓ వైపు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ , మరోవైపు జపాన్ ప్రభుత్వం చెబుతున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో సుమారు 11 వేలకు పైగా అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, అధికార ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను ఒక్కచోటికి చేర్చి, వాళ్ల ఆరోగ్యాలకు ఎలాంటి హాని జరగకుండా ఈ క్రీడలను నిర్వహించడం కత్తిమీద సామే.

వద్దంటున్న జపాన్ ప్రజలు..
ఏ దేశమైనా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తుంది. ఆ దేశ ప్రజల ఎంతో సంతోషిస్తారు. కానీ ఇప్పుడు జపాన్‌లో మాత్రం ప్రజలే ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. కరోనాతో అల్లాడుతున్న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండా మెగా ఈవెంట్ నిర్వహించడం సురక్షితం కాదంటున్నారు.
ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ దేశంలో ఇప్పటి వరకూ నత్తనడకన సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని సూగా నేతృత్వంలోని జపాన్ ప్రభుత్వం ఇటీవలే వేగవంతం చేసింది. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డ ఈ క్రీడలపై జపాన్ భారీగా ఖర్చు పెట్టింది. ఒకవేళ ఆ క్రీడలు రద్దయితే మాత్రం ఆ దేశం సుమారు రూ.1.5 లక్షల కోట్లు నష్టపోవాల్సి ఉంటుంది.

17 రోజులు.. 33 ఆటలు.. 339 ఈవెంట్లు..
టోక్యో ఒలింపిక్స్ 17 రోజుల పాటు కొనసాగనున్నాయి. జులై 23న ఆరంభమయ్యే (అంతకంటే రెండు రోజుల ముందుగానే బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి) ఈ మెగా క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. మొత్తం 33 క్రీడాంశాల్లో 339 ఈవెంట్లు నిర్వహించనున్నారు. కొత్తగా ఆరు క్రీడలు ఈ ఒలింపిక్స్‌లో కొత్తగా ఆరు క్రీడలను ప్రవేశపెడుతున్నారు. కరాటె, స్కేట్‌బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ ఒలింపిక్స్ అరంగేట్రం చేయనుండగా.. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ తిరిగి ఈ మెగా క్రీడల్లో అడుగుపెట్టనున్నాయి.

ఆందోళనలో అథ్లెట్లు
కరోనా కారణంగా ఒలింపిక్స్‌కు ముందు కీలకమైన అర్హత టోర్నీలు రద్దవ్వడంతో బ్యాడ్మింటన్, బాక్సింగ్ సహా ఇతర క్రీడాంశాల్లోని ఆటగాళ్ల అవకాశాలు దెబ్బతిన్నాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ఈ మెగా క్రీడలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రైనింగ్ కూడా సజావుగా సాగడం లేదు. భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా మన అథ్లెట్లు ఒక్క చోట చేరి సాధన చేసే అవకాశాలు లేవు. దీంతో సాధన కోసం భారత షూటింగ్ బృందం క్రొయేషియా వెళ్లింది. ఫెన్సర్ భవానీ దేవి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తదితర అథ్లెట్లు విదేశాల్లోనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.

భారత్ నుంచి భారీ బృదం..
భారత్ నుంచి ఈ సారి భారీ అథ్లెట్ల బృందమే ఒలింపిక్స్ బరిలో దిగనుంది. ఇప్పటివరకూ 14 క్రీడాంశాల నుంచి 99 మంది అథ్లెట్లు ఈ మెగా క్రీడలకు అర్హత సాధించారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడల్లో మనవాళ్లు పాల్గొనబోతున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధుతో పాటు రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, బాక్సింగ్‌లో మేరీకోమ్, అమిత్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, పురుషుల హాకీ జట్టు, షూటర్లు మెడల్స్‌పై ఆశను కల్పిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications