
టోక్యో: మరోవారం రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేవనుంది. మెగా గేమ్స్ సందర్భంగా అథ్లెట్లకు కరోనా వైరస్ సోకకుండా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) గురువారం పలు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. పతకాల ప్రదానోత్సవంలో విజేతలు, పతకాలు అందజేసేవారితో పాటు వాలంటీర్లు ఎవరూ గ్రూప్ ఫొటోలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. పోడియం వద్ద పతకాలు అందజేసేటప్పుడు మాస్కులు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి ఆర్యోగ్యం దృష్టిలో పెట్టుకొని అనేక మార్పులు చేశామని, అందరూ సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ఐఓసీ ఈ ప్రకటనలో పేర్కొంది.
ప్రారంభ వేడుకకు ముందు నుంచే ఈ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు. ఇవన్నీ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకేనని ఆయన స్పష్టం చేశారు.
గైడ్‌లైన్స్ ఏమిటంటే..
1. మెడల్స్ తీసుకునేటప్పుడు విన్నర్స్ ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలి.
2. మెడల్స్ అందుకునే పోడియం వద్ద గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ విన్నర్స్ భౌతిక దూరం పాటించాలి.
3. మెడల్స్ ఇచ్చేవారు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
4. ప్రతి ఈవెంట్ వద్ద ఐఓసీ సభ్యుడితో పాటు అంతర్జాతీయ ఫెడరేషన్ ప్రతినిధి మాత్రమే ఉంటారు.
5. అథ్లెట్లు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ఇక కోవిడ్ నేపథ్యంలో ఆల్టర్‌నేట్ ప్లేయర్ల విషయంలో గందరగోళం నెలకొంది. వాళ్లను గేమ్స్ విలేజ్‌లోకి అనుమతిస్తారా? లేక ఇతర ప్రదేశాల్లో అకామడేషన్ ఇస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు.