
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బతగిలింది. వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 1-7తో చిత్తుగా ఓడింది. ఈ మధ్య కాలంలో భారత్ ఇంత దారుణంగా ఓడటం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా తరఫున బ్లేక్ గోవర్స్(40, 42వ నిమిషం) డబుల్ గోల్స్ అందించగా..
జేమ్స్ బీల్(12వ నిమిషం), జెరెమీ హేవార్డ్(21వ నిమిషం), ఆండ్రూ ఒగిలివీ(23)వ నిమిషం), జోషువా బెల్ట్జ్(26వ నిమిషం), ట్రిబ్రాండ్(51వ నిమిషం) చెరొక గోల్ నమోదు చేశారు. భారత్ తరఫున దిల్ ప్రీత్ సింగ్(34వ నిమిషం) ఒక్కడే ఏకైక గోల్ సాధించాడు.
ఆట ఆరంభంలోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా.. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించలేకపోయాడు. ఆ కొద్ది సేపటికే జేమ్స్ బిల్ ఆస్ట్రేలియా ఖాతా తెరిచాడు. దాంతో ఫస్ట్ క్వార్టర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 1-0తో లీడ్‌లో నిలిచింది. ఇక సెకండ్ క్వార్టర్‌లో మరింత జోరు కనబర్చిన ఆస్ట్రేలియా.. భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 21వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఆస్ట్రేలియా ప్లేయర్ జెరెమీ హెవార్డ్ గోల్‌గా మలచగా.. మరో రెండు నిమిషాలకే ఆండ్రూ ఒగిలివీ గోల్ కొట్టాడు. దాంతో ఆస్ట్రేలియా 4-0తో ఫస్టాఫ్‌ను ముగించింది.
సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత దిల్ ప్రీత్ సింగ్ 34వ నిమిషంలో గోల్ చేసి భారత శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ బ్లేక్ గోవర్స్ రెండు నిమిషాల వ్యధిలోనే రెండో గోల్స్ కొట్టి భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 40వ నిమిషంలో సహచర ప్లేయర్ అందించిన పాస్‌ను గోల్‌గా మలచిన బ్లేక్ గోవర్స్.. 42వ నిమిషం లభించిన పెనాల్టీని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇక నాలుగో క్వార్టర్‌లో ఆసీస్ ప్లేయర్ టీబ్రాండ్(51వ నిమిషం) గోల్ చేయడంతో ఆసీస్ 7-1తో భారీ ఆధిక్యంలో నిలిచి సునాయస విజయాన్నందుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 2-3తో చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. పూల్-ఏలో ఉన్న మన్‌ప్రీత్ సేన.. మంగళవారం స్పెయిన్‌తో, గురువారం అర్జెంటీనాతో, శుక్రవారం ఆతిథ్య జపాన్‌తో ఆడనుంది.