
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల ఫస్ట్ బ్యాచ్ శనివారం ఢిల్లీ నుంచి టోక్యోకు బయలుదేరింది. ఎనిమిది క్రీడలు.. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి ఉన్నారు. ఇందులో హాకీ క్రీడాకారులే ఎక్కువ.
తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పీవీ సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్ శనివారం బయల్దేరి వెళ్లిన బృందంలో ఉన్నారు. టీటీ క్రీడాకారులు మనిక బత్రా, శరత్‌కమల్, ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ తదితరులు కూడా ఈ బృందంలో సభ్యులు. భారత్ నుంచి ఒలింపిక్స్ బరిలోకి ఉన్న ఏకైక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శుక్రవారమే అమెరికా నుంచి టోక్యోకు చేరుకుంది. ఆమెతో పాటు జాతీయ కోచ్ విజయ్ శర్మ, సహాయ కోచ్ సందీప్ కుమార్ ఉన్నారు. మరో సహాయ కోచ్ ప్రమోద్ శర్మ భారత తొలి బృందంతో కలిసి వెళ్లాడు.
ఈ ఒలింపిక్స్‌కు భారత్ మొత్తం 228 బృందం వెళ్తోంది. ఇందులో 119 మంది క్రీడాకారులు ఉన్నారు. భారత రోయింగ్, షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్నాయి. ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్ బృందం ఆదివారం చేరుకుంటుంది. భారత్ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం తొలుత టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు అక్కడికి చేరుకున్నారు. సాయి ప్రణీత్, సాత్విక్.. త్రివర్ణాలతో ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశారు.
ఆర్చర్ దీపికా కుమారి, హాకీ మహిళల టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్ కూడా ఇందులో ఉన్నారు. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ఐవోఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా, సెక్రటరీ రాజీవ్ మోహతా, సాయ్ డైరెక్టర్ సందీప్ ప్రధాన్.. ప్లేయర్లకు సెండాఫ్ ఇచ్చారు. జూలై 23న టోక్యో ఒలింపిక్స్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే.