
కరోనా కలకలం...
అంతా బాగుందిలే... ఇక వేడుకలే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో బుధవారం నాటి కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క టోక్యోలోనే 1,149 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. గత ఆరు నెలల కాలంలో ఇదే అత్యధికమని టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్ ప్రకటించింది. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ కోవిడ్ కేసుల పెరుగుదల జపాన్ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), గేమ్స్ నిర్వాహక కమిటీలను కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది. టోక్యోలో జనవరి 22న 1,184 మంది కోవిడ్ బారిన పడగా ఆ తర్వాత ఎప్పుడూ ఆ స్థాయికి రానేలేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రొటోకాల్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ఐఓసీ, జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

జపాన్ రాజు చేతుల మీదుగా...
టోక్యో విశ్వక్రీడలను జపాన్ రాజు ప్రారంభిస్తారని గేమ్స్ నిర్వాహక కమిటీ వర్గాలు తెలిపాయి. జపాన్ చక్రవర్తి నరుహితో 23న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలు ఆరంభమయినట్లు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. 61 ఏళ్ల రాజు నరుహితో టోక్యో ఒలింపిక్స్‌కు ప్యాట్రన్‌గా ఉన్నారు.
వేడుకల్లో భాగంగా ఇంపీరియల్ ప్యాలెస్‌లో విదేశీ వీఐపీలతో భేటీ అవుతారని అక్కడి వర్గాలు తెలిపాయి. గతంలో జపాన్ ఆతిథ్యమిచ్చిన మెగా ఈవెంట్‌లను ఈ రాజు కుటుంబీకులే ఆరంభించారు. 1998 వింటర్ ఒలింపిక్స్‌ను ఆయన తండ్రి అకిహితో ప్రారంభించగా, 1964 సమ్మర్ ఒలింపిక్స్, 1972 వింటర్ ఒలింపిక్స్‌లను తాత... హిరోహితో రాజదర్పంతో ఆరంభించారు.

ఆరుగురితో ప్రతిజ్ఞ...
ఆనవాయితీగా వేడుకల ప్రారంభోత్సవంలో ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. సాధారణంగా ముగ్గురితో జరిపే ఈ లాంఛనాన్ని ఈసారి ఆరుగురితో నిర్వహిస్తారు. లింగ సమానత్వంలో భాగంగా ప్రతిజ్ఞ చేసే అథ్లెట్ల సంఖ్యను పెంచినట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. అంటే ముగ్గురు చొప్పున మహిళలు, పురుషులు ప్రతిజ్ఞలో పాల్గొంటారు.


Click it and Unblock the Notifications
