
పానీ పూరి ఇష్టం
పానీ పూరిలు, స్వీట్లు తినడం తనకు చాలా ఇష్టమని నీరజ్ చోప్రా తాజాగా పేర్కొన్నాడు. 'పానీపూరిలు తినడం వల్ల ఎలాంటి హాని లేదని అనుకుంటున్నా. అందులో ఎక్కువగా నీరు ఉంటుంది. మన పొట్టలో అధిక భాగం నీటితో నిండి ఉంటుంది. పానీపూరి చూడటానికి పెద్దగా కనిపించినా.. దానిలో చాలా తక్కువ పిండి ఉంటుంది. ఎక్కువగా తింటున్నామని మనకు అనిపించినప్పటికీ.. వాటిని తినడం ద్వారా ఎక్కువ నీరు తీసుకుంటాం. వీటిని రోజూ తినాలని నేను అనట్లేదు. అప్పుడప్పుడు పానీపూరి తినడం మంచిదేనని ఒక అథ్లెట్‌గా నా అభిప్రాయం చెపుతున్నా' అని నీరజ్ చోప్రా అన్నాడు.

ఆరు నెలల ముందు నుంచే
నీరజ్ చోప్రాకు ఇష్టమైన మరో ఆహారం ఉంది. అదేంటంటే.. ఇంట్లో తయారు చేసిన చుర్మా (పంచదార, నెయ్యితో చేసిన రోటీ). నీరజ్ చోప్రా.. రాక కోసం ఎదురుచూస్తున్నానని ఆయన తల్లి సరోజ్ దేవి అన్నారు. నీరజ్ రాగానే అతనికిష్టమైన చుర్మా వంటకం తినిపించాలని ఉందని ఆమె చెప్పారు. స్వీట్లు తినాలని ఉన్నా.. ఈవెంట్స్‌కు ముందు వాటికి దూరంగా ఉండేవాడని సరోజ్ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ కోసం ఆరు నెలల ముందు నుంచి వాటిని తినడం మానేశాడని ఆమె పేర్కొన్నారు. భారత దేశంకు స్వర్ణం రావడం చాలా సంతోషంగా ఉందని, అందరం కలిసి సంబరాలు చేసుకున్నామని సరోజ్ చెప్పుకొచ్చారు.
అథ్లెట్‌గానే మనకు తెలుసు.. ప్రపంచానికి తెలియని మరో కోణం కూడా నీరజ్ చోప్రాలో ఉంది! అదేంటో తెలుసా?

బ్రెడ్ ఆమ్లెట్ కూడా
తనకు ఇష్టమైన ఆహారాల గురించి ఒలింపిక్స్ 2020కు వెళ్లడానికి ముందు నీరజ్ చోప్రా మీడియాతో పంచుకున్నాడు. తనకు బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతో ఇష్టమని, వారం రోజులు ఏ సమయంలోనైనా బ్రెడ్ ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతానని చెప్పాడు. తన కోసం సాల్టెడ్ రైస్ వండుకుంటాడు. ఇక టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటాడు. ప్రాక్టీస్ చేసేప్పుడు మాత్రం పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. అక్కడ దొరికే ఆహారాలను తీసుకుంటాడు. ఇటీవలనే తన డైట్‌లోకి సాల్మన్ చేపలను చేర్చుకున్నాడు. తన శరీర బరువును బట్టి ఎప్పటికప్పుడు నీరజ్ డైట్ మారుస్తూ ఉంటాడు.

చోప్రా తండ్రి రైతు
నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామం. నీరజ్ చోప్రా తండ్రి రైతు. చిన్నప్పుడు నీరజ్‌కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. కానీ 11 ఏళ్ల వయసు అప్పుడే జావెలిన్ మీద ఆసక్తి ఏర్పడింది. పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్.. జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీరజ్‌కు కూడా జావెలిన్ నేర్చుకోవాలనే కుతూహలం ఏర్పడింది. అలాజజ పంచ్‌కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉండి జావెలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు. అతడి తల్లి సరోజ్ గృహిణి. నీరజ్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ చోప్రా 24 డిసెంబర్, 1997 లో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 23 ఏళ్లు.


Click it and Unblock the Notifications












