Tokyo 2020: ముగిసిన సింధు స్వర్ణ పోరాటం.. ఆశలు రేపిన కమల్ ప్రీత్, భారత మహిళల హాకీ టీమ్!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం భారత్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన స్వర్ణ పోరాటాన్ని సెమీస్‌లోనే ముగించింది. బాక్సర్లు అమిత్ పంఘల్, పూజారాణి ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి దారిపట్టారు. హాకీ మహిళలు అద్భుత విజయంతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఆర్చర్ అతాను దాస్ తీవ్రంగా నిరాశపరచగా..అథ్లెటిక్స్‌లో కమల్‌ప్రీత్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇతర అథ్లెట్స్ సీమా పూనియా తీవ్రంగా నిరాశపరించింది. శుక్రవారం భారత ఈవెంట్స్ ఫలితాలపై ఓ లుక్కెద్దాం!

ఆర్చర్
ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో మంచి ప్రదర్శన చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్తాడని భావించిన స్టార్ ఆర్చర్ అతాను దాస్ శనివారం ఉదయం నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అతడు జపాన్ ఆర్చర్ తాకాహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు.

అథ్లెటిక్స్
ఒలింపిక్స్ మహిళల డిస్కస్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమయ్యేలా కనిపిస్తోంది. తుదిపోరుకు నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో శనివారం ఉదయం కమల్‌ప్రీత్ కౌర్ రెండో స్థానంలో నిలిచి అత్యద్భుత ప్రదర్శన చేసింది. దాంతో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న సీమా పూనియా 16వ స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్ 66.42 మీటర్లతో అందరికన్నా ముందు అగ్రస్థానంలో నిలిచింది. కమల్‌ప్రీత్ 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించింది.
కాగా, ఫైనల్ పోటీ ఆగస్టు 2న జరగనుంది. అక్కడ మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్ ఫైనల్లోనూ ఇలాంటి మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌కు మరో పతకం ఖాయమనే చెప్పొచ్చు.
భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీ శంకర్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. 7.69 మీటర్లు దూకి 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

హాకీ..
ఒలింపిక్స్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు గ్రూప్-ఏలో చివరి మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి పూల్ మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది. వందన కతారియా హ్యాట్రిక్ గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 4, 17, 49వ నిమిషాల్లో వరుసగా గోల్స్ నమోదుచేసింది. ఈ విజయంతో గ్రూప్ దశలో వరుసగా రెండో విజయం సాధించి ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై బ్రిటన్ 2-0తో విజయం సాధించడంతో భారత జట్టు క్వార్టర్స్ బెర్త్ ఖరారైంది.

బాక్సింగ్..
భారత స్టార్ బాక్సర్, ప్రపంచ నంబర్ వన్ అమిత్ పంఘాల్ 52 కేజీల విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమిపాలయ్యాడు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేతగా నిలిచిన యుబెర్జెన్ మార్టినెజ్ చేతిలో అమిత్ 1-4 తేడాతో విఫలమయ్యాడు. 69-75 కిలోల మహిళల బాక్సింగ్ బౌట్‌లో పూజా రాణి ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో చైనా బాక్సర్ లీ క్వియాన్ చేతిలో 5-0 తేడాతో పూజా మ్యాచ్‌ను చేజార్చుకుంది. చైనా బాక్సర్ లీ.. మూడు రౌండ్లలోనూ దూకుడు ఆటను ప్రదర్శించింది. భారీ పంచ్‌లతో పూజాను కోలుకోకుండా చేసింది. దీంతో అయిదుగురు జడ్జీలు చైనా బాక్సర్ వైపే మొగ్గు చూపారు.

బ్యాడ్మింటన్..
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్‌లో సింధు ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్‌లోనూ మరింత పట్టుదలగా ఆడిన తై జు.. భారత షట్లర్‌కు ఏ అవకాశం ఇవ్వలేదు. సింధు ఇక బ్రాంజ్ మెడల్ కోసం చైనా ప్లేయర్ హే బింగ్‌జియోతో ఆదివారం తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications