Tokyo 2020: కలిసిరాలేదు.. హాకీతో సహా పాల్గొన్న అన్ని ఈవెంట్లలో ఓటమే!

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మంగళవారం ఏమాత్రం కలిసిరాలేదు. ఒక్క విజయం కూడా దక్కలేదు. పాల్గొన్న అన్ని ఈవెంట్లలో ఓటమే ఎదురైంది. 49 ఏళ్ల తర్వాత సెమీఫైనల్ చేరి ఆశలు రేకెత్తించిన భారత పురుషుల హాకీ టీమ్.. ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఓటమి బాధలో బ్రాంజ్ ఫైట్‌కు సిద్దమవుతోంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత షాట్‌పుట్ అథ్లెట్ తజిందర్ పాల్ సింగ్, జావెలిన్ త్రోయర్ అన్ను రాణి, రెజ్లర్ సోనమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మంగళవారం భారత ఈవెంట్స్ ఫలితాలపై ఓ లుక్కెద్దాం.!

ఒత్తిడికి చిత్తయిన హాకీటీమ్..
ఒలింపిక్స్ ఆసాంతం ఆకట్టుకున్న హాకీ పురుషుల జట్టు కీలక పోరులో బోల్తా పడింది. ఒత్తిడిని అధిగమించలేక మన్‌ప్రీత్ సింగ్ సేన ప్రతర్థికి తలవంచింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత హాకీ టీమ్ 2-5 తేడాతో బెల్జియం చేతిలో ఓటమిపాలైంది. మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ప్రీత్ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్ హెండ్రిక్స్ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్ గోల్స్‌తో టీమ్ ఇండియా కలలను చిదిమేశాడు. ఇక ఆశలన్నీ కాంస్య పతకంపైనే.. ఆఖరి నిమిషం వరకు పోరాడిన టీమ్‌ఇండియా కంచు పోరులోనైనా 41 ఏళ్ల పతకాల కరవుకు తెరదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

షాట్‌పుట్‌లో నిరాశే..
పురుషుల షాట్‌పుట్ విభాగంలో తజిందర్ పాల్ సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగాడు. క్వాలిఫికేషన్ మ్యార్క్ 21.20 మీటర్ల దూరం అందుకోలేకపోయాడు. మూడు ప్రయత్నాల్లో రెండు సార్లు ఫౌల్ చేసిన అతను తొలి ప్రయత్నంలో గుండును 19.99 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 13వ స్థానంలో నిలిచి విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు. తన వ్యక్తిగత బెస్ట్ 21.49 మీటర్లను కూడా తజిందర్ అందుకోలేకపోయాడు. రెండు సార్లు ఫౌల్ చేయడం అతని క్వాలిఫికేషన్‌పై ప్రభావం చూపింది.

జావెలిన్ త్రో.
భారత మహిళ జావెలిన్ త్రో క్రీడాకారిణి అన్ను రాణి సైతం క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగింది. తొలి ప్రయత్నంలో 50.35 మీ. విసిరిన అన్ను.. తర్వాత వరుసగా 53.19 మీ., 54.04 మీ. విసిరింది. దాంతో 14వ స్థానంలో నిలిచి విశ్వక్రీడల నుంచి నిష్క్రమించింది. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 63 మీ. దూరం విసరాల్సి ఉంది. పోలండ్ అమ్మాయి మరియా 65.24 మీ. విసిరి ఫైనల్‌కు అర్హత సాధించింది.

కొంపముంచిన ఆఖరి పాయింట్..
అచ్చొచ్చిన రెజ్లింగ్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. కెరీర్లో తొలి ఒలింపిక్స్ ఆడుతున్న సోనమ్ మాలిక్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 62 కేజీల విభాగంలో పోటీపడిన సోనమ్.. మంగోలియా రెజ్లర్ బోలోర్తుయా ఖురేల్ఖుపై 2-2 తేడాతో పరాజయం చవిచూసింది. తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఈ 19 ఏళ్ల భారత రెజ్లర్. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను(టేక్ డౌన్) ఎత్తిపడేసింది. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్ చేసింది మంగోలియన్ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications