
సింధు ముందంజ.. ప్రణీత్ ఔట్
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్-జేలో జరిగిన రెండో పోరులో ఆమె సునాయాస విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్ ఎంగన్ యిని 21-9, 21-16 తేడాతో వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో యమగూచి, సెమీస్‌లో తైజు యింగ్‌తో తలపడే అవకాశం ఉంది. ఇక సాయి ప్రణీత్ 14-21, 14-21 తేడాతో నెదర్లాండ్స్ ఆటగాడు ఎం కల్‌జౌవు చేతిలో ఓడాడు. ప్రిక్వార్టర్స్‌కు చేరుకోలేక ఇంటిదారిపట్టాడు.

పతకానికి పంచ్ దూరంలో..
బాక్సింగ్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. 75 కిలోల విభాగంలో పూజారాణి క్వార్టర్స్‌కు చేరుకుంది. అల్జీరియాకు చెందిన ఇచ్రక్ చైబ్‌ను 5-0తో చిత్తుగా ఓడించింది. మూడు రౌండ్లలోనూ ఆమె ఆధిపత్యం చెలాయించడంతో ఐదుగురు న్యాయనిర్ణేతలూ ఆమెకే ఓటు వేశారు. ఫస్ట్ ఒలింపిక్స్ ఆడుతున్నప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. సెమీస్ చేరితే ఆమెకు కనీసం కాంస్య పతకం లభిస్తుంది. మంగళవారం లవ్లీనా క్వార్టర్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్సింగ్‌లో సెమీస్‌లో ఓడిన ఇద్దరికీ మెడల్ ఇస్తారు.

దీపిక బౌన్స్ బ్యాక్..
ఆరంభంలో తీవ్రంగా నిరాశపరిచిన వరల్డ్ నెంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి బౌన్స్ బ్యాక్ అయింది. మహిళల వ్యక్తిగత 1/32 విభాగంలో దీపికా కుమారి అద్భుత ప్రదర్శనతో మెడల్ ఆశలు రేపింది. తొలి నాకౌట్ పోరులో భూటాన్‌కు చెందిన కర్మను 6-0 తేడాతో చిత్తు చేసింది. కీలకమైన ప్రిక్వార్టర్స్‌లో మాత్రం కాస్త శ్రమించింది. ఏకంగా ఐదు సెట్లు ఆడాల్సి వచ్చింది. అమెరికా అమ్మాయి జెన్నిఫర్ ఫెర్నాండెజ్‌ను 6-4తో ఓడించింది. నాలుగో సెట్లో స్కోరు 4-4తో సమం కావడంతో ఐదో సెట్ కీలకంగా మారింది. ఒత్తిడికి గురైనప్పటికీ దీపిక 26-25 తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి మరో 2 పాయింట్లు అందుకుంది. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో వీరిద్దరూ వెనుదిరిగారు.

రోయింగ్/సెయిలింగ్‌లో నిరాశే..
ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్న రోయింగ్ ప్లేయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. రోయింగ్ సెమీ ఫైనల్ 2లో ఆరో స్థానంలో నిలిచారు. ఫైనల్‌కు చేరుకోలేదు. కానీ వారి ఆటతీరును అందరూ ప్రశంసిస్తున్నారు. సెయిలింగ్‌లో పురుషుల స్కిఫ్ లో కేసీ గణపతి, వరుణ్ టక్కర్ జోడీ మూడు రేసుల్లో 18, 17, 19 స్థానాల్లో నిలిచింది. మొత్తంగా 18వ స్థానం సాధించారు.

ప్చ్.. మహిళల హాకీ టీమ్ మళ్లీ ఓటమి..
ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల పరాజయాల పరంపర కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచులో 4-1 తేడాతో రాణీరాంపాల్ సేన చిత్తయింది. అందివచ్చిన అవకాశాలను టీమ్‌ఇండియా చేజేతులా జారవిడిచింది. ఇక భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తర్వాత తలపడే ప్రతి మ్యాచులోనూ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి. బ్రిటన్‌లో హన్నా మార్టిన్ (2ని, 19ని), లిలీ (41ని), గ్రేస్ బాల్స్‌డన్ (57 ని) గోల్స్ చేశారు. భారత్ నుంచి షర్మిలా దేవి (23 ని) ఒక్కరే గోల్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications
