
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత రెజ్లర్ దీపక్ పునియా కోచ్ మరోద్ గైద్రోవ్‌ను గేమ్స్ విలేజ్ నుంచి నిర్వాహకులు గెంటేసారు. గురువారం జరిగిన కాంస్యం పోరులో దీపక్ పునియా ఓటమితో సహనం కోల్పోయిన గైద్రోవ్.. రిఫరీ రూమ్‌లోకి వెళ్లి అసభ్యపదజాలంతో దూషించడమే కాకుండా చేయి చేసుకున్నాడంట. ఈ హఠాత్ సంఘటనతో దీపక్ పునియా కోచ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ఒలింపిక్ కమిటీ, అతన్ని స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరించింది.
అలసలేం జరిగిందంటే.. గురువారం జరిగిన పురుషుల రెజ్లింగ్ 86 కేజీల బ్రాంజ్ ఫైట్‌లో దీపక్ పునియా ప్రత్యర్థి సాన్ మారినోకు చెందిన మైల్స్ అమైన్ చేతిలో 2-4 తేడాతో ఓడిపోయాడు. ఆరంభంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన దీపక్ పునియా చివర్లో తడబడి చేజేతులా ప్రత్యర్థికి విజయాన్నందించాడు. ఆఖరి 10 సెకన్ల వరకూ ఆధిక్యంలో ఉన్న దీపక్ పునియా, ఆఖర్లో ప్రత్యర్థికి పాయింట్ల అప్పగించి ఓటమి పాలయ్యాడు. అయితే ఈ నిర్ణయంపై దీపక్ పునియా కోచ్ మరోద్ గైద్రోవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వెంటనే రిఫరీ నిర్ణయాన్ని ఛాలెంజ్ కూడా చేశాడు. దీపక్ పునియా డిఫెన్స్‌లో ఉన్నప్పుడే సమయం ముగిసినా రిఫరీ దాన్ని గమనించకుండా ప్రత్యర్థికి పాయింట్లు అప్పగించాడ మరోద్ గైద్రోవ్ ఆరోపించాడు.
అయితే భారత రెజ్లింగ్ కోచ్ తీసుకున్న చాలెంజ్‌ను రిఫరీ బోర్డు తిరస్కరించింది. దాంతో చిర్రెత్తుకుపోయిన దీపక్ పునియా ఫారిన్ మరోద్.. గేమ్ ముగిసిన తర్వాత రిఫరీల రూమ్‌కి వెళ్లి, ఆ ఫైట్‌కి రిఫరీగా వ్యవహరించిన అధికారిని బండ బూతులు తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నాడు. దాంతో ఒలింపిక్ కమిటీ ముందుగా స్పోర్ట్స్ విలేజ్ నుంచి బహిష్కరించి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. తృటిలో మెడల్ చేజారినప్పటికీ.. 23 ఏళ్ల దీపక్ పునియా తన అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2020 వరల్డ్ కప్ తర్వాత దీపక్ పునియా మళ్లీ ఏ ఈవెంట్‌లో పాల్గొనలేదు. పొలాండ్ ఓపెన్‌కు ముందు అతని ఎడమ చేతికి గాయమవ్వడంతో టోర్నీలకు దూరంగా ఉన్నాడు. నేరుగా ఒలింపిక్స్ బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
ఇక,శుక్రవారం రెజ్లింగ్‌లో భారత్ కు నిరాశ ఎదురైంది. మెడల్ ఆశలు రేకెత్తించిన బజరంగ్ పునియా కీలక సెమీఫైనల్లో పోరాడి ఓడాడు.అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్ చేతిలో 5-12 తేడాతో ఓడిపోయాడు. ఇక, కాంస్యం కోసం జరిగే పోరులో బజరంగ్ పునియా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్, రియో ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన హాజీ అలియేవ్.. ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడి బజరంగ్ మీద ఒత్తిడి పెంచాడు. కాంస్యపోరులో జపాన్‌కు చెందిన టకుటో ఒటోగురోతో బజరంగ్ పునియా అమీతుమీ తేల్చుకోనున్నాడు.