
టోక్యో: అమెరికా స్టార్ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకంతో చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన మహిళల 400 మీటర్ల పరుగుపందెంలో ఫెలిక్స్ కాంస్యం గెలిచింది. బహమాస్ అథ్లెట్ షానె మిల్లర్‌కు స్వర్ణం, మెర్లెడిన్ పాలినో (డొమినికా రిపబ్లిక్)కు కాంస్యం దక్కాయి. కాగా.. ఓ బిడ్డకు తల్లి కూడా అయిన 35 ఏళ్ల ఫెలిక్స్‌కు ఇది కెరీర్‌లో పదో ఒలింపిక్ మెడల్ కావడం విశేషం. దీంతో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పది ఒలింపిక్ పతకాలు గెలిచిన జమైకా మాజీ అథ్లెట్ మెర్లెన్ ఒట్టే, కార్ల్ లూయిస్ (అమెరికా) సరసన ఫెలిక్స్ చేరింది.
ఇటలీ పురుషుల జట్టు 4X400 మీటర్ల రిలేలో తొలిసారి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 100 మీటర్ల స్ప్రింట్ విజేత మార్సెల్ జాకబ్స్‌తో కూడిన ఇటలీ 37.50 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్ (37.51సెకన్లు) రజతం, కెనడా (37.70సెకన్లు) కాంస్యం నెగ్గాయి. మహిళల 4X100 మీటర్ల రిలే పసిడి పతకాన్ని (41.02సె) జమైకా గెలుచుకోగా.. అమెరికా (41.45సె) రజతం, బ్రిటన్ (41.88సె) కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి. పురుషుల 1500 మీటర్ల పరుగులో కిప్‌యెగాన్ (కెన్యా) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. బ్రిటన్, హాలెండ్ రజత, కాంస్యాలు నెగ్గాయి.
ఆసియా రికార్డు బ్రేక్ చేసినా..
ట్రాక్‌లో భారత అథ్లెట్ల వైఫల్యం కొనసాగుతోంది. పురుషుల 4X400 మీటర్ల రిలేలో భారత జట్టు ఆసియా రికార్డు టైమింగ్‌ను బద్దలుకొట్టినా.. ఫైనల్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. మహ్మద్ అనాస్, నిర్మల్, రాజీవ్ ఆరోకియా, జాకబ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 25 సెకన్లలో రేసు పూర్తిచేసి తమ గ్రూపు హీట్స్‌లో నాలుగోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కతార్ జట్టు 2018 ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 56 సెకన్లతో నమోదుచేసిన ఆసియా రికార్డు టైమింగ్‌ను భారత జట్టు అధిగమించింది. అయితే, హీట్స్‌లో ప్రతి గ్రూప్ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు మాత్రమే ఫైనల్ చేరే అవకాశముండడంతో భారత్‌కు నిరాశే ఎదురైంది.
ఇక, మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్‌లో భారత అథ్లెట్లు పూర్తిగా విఫలమయ్యారు. ప్రియాంక గోస్వామి 17వ, భావనా జాట్ 32వ స్థానాల్లో నిలిచి నిరాశపరిచారు. పురుషుల 50 కిలో మీటర్ల రేస్ వాకింగ్‌లో గురుప్రీత్ రేస్‌ను పూర్తి చేయలేకపోయాడు. ఎండవేడిమికి తట్టుకోలేక 35 కిలోమీటర్ల తర్వాత నిష్క్రమించాడు.