బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు లక్ష్యసేన్, కిరణ్ జార్జ్ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, సాత్విక్/చిరాగ్ జోడీ మాత్రం పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అన్‌సీడెడ్ లక్ష్యసేన్ 21-17, 21-15తో నాలుగో సీడ్ లిషి ఫెంగ్ (చైనా)పై గెలుపొందాడు. క్వార్టర్‌ఫైనల్లో జున్ హవో (మలేసియా)ను సేన్ ఢీకొంటాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కిరణ్ జార్జ్ 21-11, 21-19తో వెంగ్ హంగ్ యంగ్ (చైనా)ను వరుస గేముల్లో ఓడించాడు.

కిరణ్ ర్యాంకు 59 కాగా.. యంగ్ 29వ ర్యాంకర్ కావడం గమనార్హం. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ 500 టోర్నీలో కిరణ్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. తదుపరి రౌండ్‌లో జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జార్జ్ తలపడతాడు.
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. గురువారమే జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సైనా 11-21, 14-21తో మూడో సీడ్ బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడింది. మరో ప్రిక్వార్టర్స్‌లో 23 ఏళ్ల అస్మిత 18-21, 13-21తో ఒలింపిక్ మెడలిస్ట్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూసింది.
పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీకి ఊహించని షాక్ తగిలింది. ప్రిక్వార్టర్స్‌లో ఇండోనేసియా అన్‌సీడెడ్ ద్వయం షోయ్‌బుల్-బగాస్ 24-26, 21-11, 21-17 తో సాత్విక్ జోడీనీ చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన భారత జోడీ అనవసర తప్పిదాలతో రెండో గేమ్‌ను చేజేతులా చేజార్చుకుంది. మూడో గేమ్‌లో ఆరంభంలో 1-5తో వెనుకబడిన సాత్విక్ జోడీ.. ఆ తర్వాత అద్వితీయమైన ఆటతో 12-17తో పుంజుకునేలా కనిపించింది. కానీ పట్టువదలని ఇండోనేసియా జోడీ భారత్ జోడీకి ఓటమిని మిగిల్చింది.
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సమీర్ వర్మలతో పాటు యువ షట్లర్లు ప్రియాన్షఉ రజావత్, మిథున్ మంజునాథ్, మాళవిక తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.